
ఉత్సవాలు ముగిసేవరకు ప్రత్యేక నిఘా
ఆలేరు: వినాయక చవితి ఉత్సవాల నేపథ్యంలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయనున్నట్లు డీసీపీ అక్షాంశ్‌యాదవ్ పేర్కొన్నారు. ఆలేరు పరిధిలోని వినాయక విగ్రహాలను నిమజ్జనం చేసే ఆలేరులోని గోధుమకుంటను బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా అన్ని మండపాల వద్ద ఉత్సవాలు ముగిసే వరకు పటిష్ట పోలీసు బందోబస్తు ఉంటుందన్నారు. సీసీ కెమెరాల ద్వారా పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. విగ్రహాల ఏర్పాటుకు నిర్వాహకులు తప్పనిసరిగా పోలీసుల అనుమతి తీసుకోవాలన్నారు. రోడ్ల మరమ్మతులు, విద్యుత్ తీగలతో ప్రమాదాలు చోటుచేసుకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులతో చర్చించినట్టు డీసీపీ చెప్పారు. నిమజ్జనం జరిగే చెరువుల వద్దకు చిన్నపిల్లలను తీసుకువెళ్లొద్దని కోరారు. చెరువుల వద్ద గజ ఈతగాళ్లు, క్రేన్‌లు అందుబాటులో ఉంటాయన్నారు. చెరువుల చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. వివిధ శాఖల అధికారులతో సమన్వయంతో ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. వినాయక మండపాల నిర్వాహకులు అధికారుల సూచనల ప్రకారం తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఏమైనా ఇబ్బందులు వస్తే పోలీసులు, అధికారులకు సమాచారం ఇవ్వాలన కోరారు. అంతకుముందు ఆలేరు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, యాదగిరిగుట్ట ఏసీపీ శ్రీనివాస్ నాయుడు, సీఐ యాలాద్రితో చెరువు వద్ద తీసుకోవాల్సిన జాగత్త్రలపై డీసీపీ చర్చించారు.
ఫ సీసీ కెమెరాలతో పర్యవేక్షణ
ఫ డీసీపీ అక్షాంశ్‌యాదవ్