
వాళ్ల అడ్డదారులు.. వీళ్లకు సిరులు!
సాక్షి యాదాద్రి: జిల్లా మీదుగా వెళ్తున్న జాతీయ రహదారులకు కొందరు అడ్డదారులు నిర్మిస్తున్నారు. సర్వీసు రోడ్లు, లింకు రోడ్లు ఏర్పాటు చేసి ప్రమాదాలకు కారణమవుతున్నారు. రోడ్డు భద్రతా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నా నేషనల్ హైవే అధికారులు నోరు మెదపడం లేదన్న విమర్శలు న్నాయి. పైగా వారికి హోటళ్లు, ఇతర వ్యాపార సంస్థలు సిరులు కురిపిస్తున్నాయి. ఇందుకు టోల్‌ప్లాజాల సిబ్బంది సహకరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. మంగళవారం నేషనల్ హైవే అథారిటి ఆఫ్ ఇండియా పీడీ దుర్గాప్రసాద్‌ను ఒక హోట్‌ల నిర్వాహకుడి నుంచి రూ.60 వేలు లంచం తీసుకుంటూ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్విస్టిగేషన్ (సీబీఐ) అధికారులకు నేరుగా చిక్కడం కలకలం రేపింది. గతంలోనూ ఇటువంటి ఘటనలు వెలుగుచూశాయి.
లక్ష రూపాయలు డిమాండ్
జాతీయ రహదారిని తవ్వి లింకు, సర్వీస్ రోడ్లు నిర్మించిన వారిపై నేషనల్ హైవే అథారిటీ అధికారులు చర్యలు తీసుకోవాలి. కానీ, పలుకుబడి కలిగిన వారిని, ముడుపులు ఇచ్చిన వారిని వదిలేస్తున్నారు. వీరికి టోల్‌గేట్ సిబ్బంది కూడా సహకరిస్తున్నారని సీబీఐ అధికారులకు ఫిర్యాదులు వెళ్లాయి. హైదరాబాద్ – వరంగల్ జాతీయ రహదారి–163 వెంట హోటల్ యజమాని, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా పీడీకి బీబీనగర్ మండలం గూడూరు టోల్‌ప్లాజా సిబ్బంది మధ్యవర్తిత్వం వహించినట్లు సమాచారం. ఇందుకోసం పీడీ లక్ష రూపాయలు డిమాండ్ చేశాడు. బుధవారం రూ.60 వేలు తీసుకుంటుండగా సీబీఐ అధికారులు దాడులు నిర్వహించి పట్టుకున్నారు. పీడీతోపాటు టోల్‌గేట్ సిబ్బందిని విచారిస్తున్నారు.
అన్నీ రూల్స్‌కు విరుద్ధంగానే..
జాతీయ రహదారుల వెంట హోటళ్లు, దాబాలు, టిఫిన్ సెంటర్లు, టీ హౌజ్‌లతో పాటు ఇతర వ్యాపార సంస్థలు విచ్చలవిడిగా వెలుస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్– వరంగల్ జాతీయ రహదారి వెంబడి ఘట్‌కేసర్ నుంచి మొదలుకొని బీబీనగర్, గూడూరు, భువనగిరి బైపాస్, రాయగిరి, వంగపల్లి, ఆలేరు బైపాస్ జనగామ జిల్లా శివారు వరకు వందల సంఖ్యలో ఉన్నాయి. వీటిలో చాలా వరకు అనుమతి తీసుకోకుండానే ఏర్పాటు చేశారు. బాటకోసం జాతీయ రహదారి, సర్వీస్ రోడ్ల వరకు తవ్వకాలు చేపట్టి లింకు చేస్తున్నారు. ప్రత్యేకంగా పార్కింగ్ సౌకర్యం లేకపోవడంతో వాహనదారులు రోడ్డుపైనే వాహనాలను నిలుపుతున్నారు. బీబీనగర్ టోల్‌గేట్ సమీపంలో అక్రమ ఏర్పాటు చేసిన పార్కింగ్ వల్ల ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ముందు సిగ్నల్ కూడా లేకపోవడం, వాహనాలు వ్యాపార కూడలి వెపు వెళ్లేందుకు ఒక్కసారిగా సర్వీస్ రోడ్డుకు మళ్లుతుండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయి.
ఏకంగా సర్వీస్ రోడ్డే వేశారు
భువనగిరి శివారులో ఇటీవల ఓ పేరు మోసిన సంస్థ హోటల్‌ను ప్రారంభించింది. హోటల్ వద్దకు వాహనాలు వెళ్లడానికి దారి లేదు. ఇందుకోసం అనుమతి లేకుండా జాతీయ రహదారి నుంచి ఏకంగా సర్వీస్ రోడ్డు నిర్మించారు. హోటల్‌పై ఓ ప్రజాప్రతినిఽధి ఫిర్యాదు చేయగా.. సర్వీస్ రోడ్డు తొలగించాలని సరదు యజమానికి జాతీయ రహదారి అధికారులు నోటీసు జారీ చేశారు. కాగా హోటల్ యజమాని తనకున్న పలుకుబడిని ఉపయోగించి ఎన్‌హెచ్‌ఏఐ అధికారులను తనవైపు కన్నెత్తి చూడకుండా చేశాడు.
హైవేల వెంట పెద్ద ఎత్తున హోటళ్లు, దాబాలు, ఇతర వ్యాపార సంస్థలు
లింకురోడ్ల కోసం జాతీయ రహదారులను తవ్వుతున్న నిర్వాహకులు
ముడుపులు తీసుకుంటూ
వదిలేస్తున్న సంబంధిత అధికారులు
ఓ రెస్టారెంట్ యజమాని నుంచి రూ.60 వేలు లంచం డిమాండ్..
సీబీఐకి పట్టుబడిన హైవే పీడీ