
స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి
కోదాడరూరల్: కోదాడ మండలం నల్లబండగూడెం గ్రామ శివారులో గల మిడ్‌వెస్ట్ గ్రానైట్ క్వారీ కంపెనీ చేపట్టనున్న 9.87 హెక్టార్ల పనుల విస్తరణపై అదనపు కలెక్టర్ రాంబాబు సమక్షంలో మంగళవారం ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో క్వారీ సమీపంలోని నల్లబండగూడెం, మంగళితండా, చిమిర్యాల గ్రామాల ప్రజలు, నాయకులు మాట్లాడుతూ.. క్వారీ విస్తరించుకుంటే తమకు అభ్యంతరం లేదని.. కానీ స్థానిక యువతకు ఎక్కువ ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు. అదేవిధంగా క్వారీ నుంచి నల్లబండగూడెం వెళ్తున్న రోడ్డు ధ్వంసమైందని.. ఈ మార్గంలో వాగుపై ఉన్న బ్రిడ్జికి మరమ్మతులు చేపట్టాలన్నారు. మూడు గ్రామాలల్లో నెలకోసారి హెల్త్ క్యాంపులు నిర్వహిచి దీర్ఘకాలిక వ్యాధులున్న ప్రజలకు మందులు అందజేయాలని కోరారు. అదేవిధంగా పాఠశాలల అభివృద్ధికి, చదువుల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచే విద్యార్థులకు ప్రోత్సాహకాలు అందజేయాలన్నారు. పలు ఎన్‌జీఓలు, పర్యావరణ, సామాజిక ఉద్యమకారులు మాట్లాడుతూ.. క్వారీ నుంచి దుమ్ముధూళి రాకుండా చూడాలని సూచించారు. క్వారీ చుట్టూ ఉన్న రైతుల పొలాలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పర్యావరణం కాలుష్యం జరగకుండా పరిసర ప్రాంతాల్లో ఎక్కువ సంఖ్యలో మొక్కలు నాటాలన్నారు. కంపెనీ సీఓఓ మల్లికార్జునరావు మాట్లాడుతూ.. క్వారీలో 80శాతం ఉద్యోగాలు స్థానికులకే కల్పిస్తున్నామని, విద్యార్హతను బట్టి టెక్నీషియన్స్, ఎలక్ట్రానిక్స్, ఆపరేటర్ విభాగంలో ఉద్యోగ అవకాశాలు ఇస్తామన్నారు. ఇప్పటికే క్వారీ చుట్టూ ఉన్న మూడు గ్రామాల కోసం ఓ అంబులెన్స్ ఏర్పాటును చేశామని, ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రాలలో మందులు ఇస్తున్నామని, పాఠశాలల అభివృద్ధికి సహకరిస్తున్నట్లు తెలిపారు. మొక్కలు కూడా నాటుతామని సమాధానం ఇచ్చారు. ఈ సమావేశంలో పలువురి వద్ద నుంచి లిఖితపూర్వకంగా, 40మంది నుంచి తీసుకున్న అభిప్రాయాలను రాష్ట్ర పర్యావరణ ఉన్నతాధికారులకు పంపిస్తామని అదనపు కలెక్టర్ రాంబాబు తెలిపారు. ఎలాంటి అవాఛంనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇంజనీర్ వెంకన్న, ఆర్డీఓ సూర్యనారాయణ, తహసీల్దార్ వాజిద్‌అలీ, డీఎస్పీ శ్రీధర్‌రెడ్డి, పలు శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఫ మిడ్‌వెస్ట్ గ్రానైట్ క్వారీ పనుల
విస్తరణపై ప్రజాభిప్రాయ సేకరణ