
ఎక్కువ ఆయకట్టుకు నీరందించేందుకు కృషి
హుజూర్‌నగర్: ఎక్కువ ఆయకట్టుకు సాగు నీరందించేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. సోమవారం హుజూర్‌నగర్‌లో రూ.7.99 కోట్లతో నిర్మించనున్న నీటిపారుదల శాఖ సమీకృత డివిజన్ కార్యాలయం–3 భవన నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేసి మాట్లాడారు. అతి తక్కువ ఖర్చుతో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు నిర్మించి ఎక్కువ ఆయకట్టుకి సాగు నీరు అందిస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇరిగేషన్ శాఖలో సంస్కరణలు తెచ్చామని, ఇందులో భాగంగా 1,100మంది ఏఈలు, 1,800 మంది లష్కర్లను నియమించినట్లు చెప్పారు. నీటిపారుదల డివిజన్ పునర్‌వ్యవ స్థీకరణ సమయంలో డివిజన్ నంబర్– 3 పరిధిలో ఉన్న ఇరిగేషన్ సబ్ డివిజన్ నంబర్ 2, 3, 4 కార్యాలయాలు కలిపి హుజూర్‌నగర్ ప్రధాన కార్యాలయంగా ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. కోదాడ నియోజకవర్గ పరిధిలోని 2,29,961 ఎకరాలు, హుజూర్‌నగర్ నియోజకవర్గంలోని 1,50,181 ఎకరాల ఆయకట్టుతో కూడిన నాగార్జునసాగర్ గ్రావిటీ కాలువలు, ఎత్తిపోతల పథకాల నీటిపారుదల సౌకర్యాలను ఈ కార్యాలయం చూసుకుంటుందని తెలిపారు. ఆరు నెలల్లో ఈ కార్యాలయం నిర్మాణం పూర్తిచేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీనివాసులు, ఇరిగేషన్ ఎస్‌ఈ నాగభూషణ్‌రావు, ఈఈలు రామకిషోర్, సత్యనారాయణ, తహసీల్దార్ నాగార్జునరెడ్డి పాల్గొన్నారు.
నీటిపారుదల శాఖ మంత్రి
ఉత్తమ్‌కుమార్‌రెడ్డి