
ప్రజావాణి అర్జీలను నిర్లక్ష్యం చేయొద్దు
భువనగిరిటౌన్ : ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ హనుమంతరావు అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్ వీరారెడ్డి, జెడ్పీ సీఈఓ శోభారాణి, అధికారులతో కలిపి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. పరిష్కారానికి సాధ్యం కానివి ఉంటే వెంటనే దరఖాస్తుదారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. వివిధ సమస్యలపై 36 అర్జీలు రాగా అందులో 23 వినతులు రెవెన్యూ సమస్యలకు సంబంధించినవి ఉన్నట్లు వెల్లడించారు.
● చీమలకొండూరు పాఠశాలలో గణిత ఉపాధ్యాయుడిని నియమించాలని గ్రామానికి చెందిన నల్లమాస బాలరాజు కోరారు.
● చౌటుప్పల్ మండలం నేలపట్ల గ్రామంలో మసీదు స్థలాన్ని ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని ముస్లింలు విన్నవించారు.
● బీబీనగర్‌లో రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మించాలని గ్రామస్తులు వినతిపత్రం అందజేశారు.
● సమగ్ర సర్వేలో పాల్గొన్న డేట ఎంట్రీ ఆపరేటర్ల రెమ్యునరేషన్ ఇప్పించాలని డేటా ఎంట్రీ ఆపరేటర్ల ప్రతినిధులు కోట నగేష్, విజయ్‌కుమార్ కలెక్టర్‌కు విన్నవించారు. డేటా ఎంట్రీ ముగిసి 8 నెలలు కావస్తుందన్నారు. కాగా వారంలోగా ఆపరేటర్ల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చినట్లు ప్రతినిధులు తెలిపారు.
ఫ కలెక్టర్ హనుమంతరావు