జాతీయ బీచ్ కబడ్డీ పోటీలకు అంపైర్‌గా వీరస్వామి
గరిడేపల్లి: ఆంధప్రదేశ్ రాష్ట్రంలోని మచిలీపట్నం బీచ్‌లో 5వ తేదీ నుంచి 8వ తేదీ వరకు జరగనున్న 12వ జాతీయ స్థాయి బీచ్ కబడ్డీ పోటీలకు టెక్నికల్ ఆఫీషియల్(అంపైర్)గా గరిడేపల్లి మండలం రంగాపురం గ్రామానికి చెందిన కొంపెల్లి వీరస్వామి ఎంపికై నట్లు తెలంగాణ రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు కాసాని వీరేశం ముదిరాజ్, ప్రధాన కార్యదర్శి మహేందర్‌రెడ్డి తెలిపారు. వీరస్వామి గతంలో 49వ జూనియర్ జాతీయ స్థాయి కబడ్డీ పోటీల్లో, వివిధ రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో రెఫరీగా వ్యవహరించినట్లు వారు తెలిపారు.
డ్రంకెన్ డ్రైవ్ కేసులో నలుగురికి జైలుశిక్ష
కోదాడరూరల్: డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన నలుగురికి ఒకరోజు జైలుశిక్ష విధిస్తూ కోదాడ కోర్టు సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ సత్యనారాయణ మంగళవారం తీర్పు వెలువరించారు. కోదాడ పట్టణ సీఐ శివశంకర్ తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం రాత్రి కోదాడ పట్టణంలోని ఖమ్మం క్రాస్‌రోడ్, రంగా థియేటర్ సెంటర్‌లో ట్రాఫిక్ ఎస్‌ఐ మల్లేష్ ఆధ్వర్యంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా.. ఐదుగురు వ్యక్తులు మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు. వారిని మంగళవాంర కోదాడ కోర్టులో హాజరుపర్చగా నలుగురికి ఒకరోజు జైలు శిక్షతో పాటు ఐదుగురికి రూ.2వేల జరిమానా విధిస్తూ జడ్జి తీర్పునిచ్చినట్లు సీఐ తెలిపారు.
షార్ట్ సర్క్యూట్‌తో
మినీ సర్వీస్ బ్యాంకు దగ్ధం
పెద్దవూర: మండల కేంద్రంలోని మినీ సర్వీస్ బ్యాంకు మంగళవారం సాయంత్రం షార్ట్ సర్క్యూట్‌తో దగ్ధమైంది. పులిచర్ల ఎస్‌బీఐ బ్యాంకు ఆధ్వర్యంలో ఎస్‌బీఐ వినియోగదారుల కోసం పెద్దవూర మండల కేంద్రంలోని శ్రీకోదండరామాలయం సమీపంలో మినీ సర్వీస్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మంగళవారం సాయంత్రం అందులో షార్ట్ సర్క్యూట్ అయ్యి మంటలు వ్యాపించాయి. దీంతో ఫ్రిడ్జ్, రెండు కంప్యూటర్లు, లాప్‌ట్యాప్‌లు, ప్రింటర్లు, కౌంటర్, నాలుగు కుర్చీలు పూర్తిగా కాలిపోయాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పక్కనే డబ్బాలకు మంటలు వ్యాపించకుండా చర్యలు తీసుకున్నారు. సుమారు రూ.2లక్షల నష్టం వాటిల్లినట్లు నిర్వాహకుడు చిట్టిమల్ల సరేష్ తెలిపారు.


