అల్లరి పిల్లవాడిని | - | Sakshi
Sakshi News home page

అల్లరి పిల్లవాడిని

Nov 14 2024 7:53 AM | Updated on Nov 14 2024 4:04 PM

బాల్య స్మృతులు పంచుకున్న ఎస్పీ శరత్‌ చంద్ర పవార్‌

బాల్య స్మృతులు పంచుకున్న ఎస్పీ శరత్‌ చంద్ర పవార్‌

చిన్నప్పుడు ఆటలతోపాటు చదువులోనూ ముందే టెన్త్‌ వరకు క్లాస్‌ టాప్‌–3లో ఉన్నా.. స్కూల్‌ కెప్టెన్‌, క్రికెట్‌ టీం కెప్టెన్‌నూ నేనే.. నేటి పిల్లలు బట్టీ చదువులకు పరిమితం కావొద్దు చదువుతోపాటు ఆటల్లోనూ రాణించాలి స్పోర్ట్స్‌తో కాన్ఫిడెన్స్‌ లెవల్స్‌ పెరుగుతాయి పిల్లలు ఏం చేస్తున్నారో తల్లిదండ్రులు గమనించాలి. చిల్డ్రన్స్‌ డే సందర్భంగా.. ‘సాక్షి’తో బాల్య స్మృతులు పంచుకున్న ఎస్పీ శరత్‌ చంద్ర పవార్‌

‘నేటి పిల్లలు బట్టీ చదువులకు పరిమితం అవుతున్నారు. అది సరైన విధానం కాదు.. కాన్సెప్ట్‌ అర్థం చేసుకొని చదివితే అది ఎప్పటికీ గుర్తుండిపోతుంది.. ప్రశ్నలు ఏ పద్ధతిలో అడిగినా జవాబులు రాయగలుగుతారు. అంతేకాదు గేమ్స్‌, స్పోర్ట్స్‌ వంటి సహ పాఠ్య కార్యక్రమాలపై ఎక్కువ దృష్టి పెట్టాలి. అప్పుడే వారిపై వారికి నమ్మకం (కాన్ఫిడెన్స్‌), పోటీతత్వం, సమస్యలను ఎదుర్కొనే పట్టుదల పెంపొందుతాయి’ అని నల్లగొండ ఎస్పీ శరత్‌చంద్రపవార్‌ పేర్కొన్నారు. తల్లిదండ్రులుఆ దిశగా విద్యార్థులను ప్రోత్సహించాలని సూచించారు. గురువారం(14వ తేదీన) జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా శరత్‌చంద్ర పవార్‌ తన బాల్య స్మృతులను‘సాక్షి’తో పంచుకున్నారు.

–సాక్షి ప్రతినిధి, నల్లగొండ

నేను పుట్టి.. పెరిగింది సికింద్రాబాద్‌లోని వెస్ట్‌ మారేడ్‌పల్లిలో. మహేంద్రహిల్స్‌లో ఆగ్జిలియం హైస్కూల్లో పదో తరగతి వరకు చదువుకున్నా. నాన్న బాలాజీ పవార్‌ డాక్టర్‌. ఆయన ఉద్యోగరీత్యా వివిధ ప్రాంతాలు తిరిగే వారు. ఇంట్లో అమ్మ సుశీల, చెల్లెలు, నేను ఉండేవారం. వివిధ ప్రాంతాల్లో ఉద్యోగం చేసిన కారణంగా నాన్న వారానికి ఒక రోజు ఇంటికి వచ్చేవారు. దీంతో అమ్మే మాకు అన్నీ. తానే కూర్చోబెట్టి చదివించేది. హోంవర్క్‌ చేయించేది. చిన్నప్పుడు నేను చాలా అల్లరి చేసే వాడిని. ఆటల్లో ముందుండే వాడిని. సెలవు వచ్చిందంటే ఇంట్లో ఉండేవాడిని కాదు. ఇంటి ఎదురుగా ఉండే గ్రౌండ్‌లోనే ఫ్రెండ్స్‌తో ఉండేవాడిని. ఇప్పుడు మా అబ్బాయి సంవ్రిత్‌కు మూడేళ్లు. చాలా అల్లరి చేస్తాడు. నేను సాయంత్రం ఇంటికి వెళ్లి వాడితో కాసేపు ఆడుకుంటే చాలా రిలీఫ్‌గా ఉంటుంది.

అన్నీ చదువుతో రావు

చదువు ఒక్కటే జీవితం కాదు..అలాగని చదువును నిర్లక్ష్యం చేయవద్దు. బట్టీ పట్టి చదవడం మానేసి కాన్సెప్ట్‌ అర్థం చేసుకోవాలి. అప్పుడే చదువులో రాణిస్తారు. ఓవరాల్‌ డెవలప్‌మెంట్‌ ముఖ్యం. పదో తరగతికి వచ్చే సరికి చదువుతోపాటు ఏదో ఒక గేమ్‌లో టాప్‌లో ఉండాలి. దాని ద్వారా వారిలో కాన్ఫిడెన్స్‌ పెరుగుతుంది. ఏదైనా సాధించాలనే పట్టుదల వస్తుంది. యూపీఎస్సీ, ఇతర పోటీ పరీక్షల ఇంటర్వ్యూల్లో అదే చూస్తారు. ఆలోచన విధానం ఎలా ఉంది.. మానసిక స్థితి ఏంటి? సమస్య పరిష్కారం ఎలా చేస్తాం.. అన్నది చూస్తారు. అవి చదువుతో రావు. స్పోర్ట్స్‌తోనే అవి మనలో డెవలప్‌ అవుతాయి. వ్యక్తిగతంగా మన జీవితంలోనూ అవే ఉపయోగపడతాయి. ఈ విషయాన్ని ఇప్పటి విద్యార్థులు అర్థం చేసుకోవాలి.

తల్లిదండ్రులే మొదటి గురువులు..

విద్యార్థులకు తల్లిదండ్రులే మొదటి గురువులు. వారు ఎప్పుడూ పిల్లలపై దృష్టి పెట్టాలి. పిల్లలేం చేస్తున్నారో గమనిస్తూ ఉండాలి. నేడు డ్రగ్స్‌కు అలవాటు పడుతున్న పిల్లల్లో స్కూల్స్‌ విద్యార్థులు ఉంటున్నారు. అది చాలా ప్రమాదకరం. పిల్లలు కుటుంబ సమ్మేళనాలకు హాజరు కాపోవడం, ఇంట్లో ఉండకపోవడం, సరిగ్గా తినకపోవడం, నిద్రపోకపోవడం వంటి లక్షణాలను గమనిస్తే జాగ్రత్తలు తీసుకోవాలి. వారేం చేస్తున్నారో తెలుసుకొని గాడిలో పెట్టాలి. డ్రగ్స్‌కు వారిని దూరంగా ఉంచే ప్రయత్నం చేయాలి. మన పిల్లలు అలా చేయరని వారితో వాటి గురించి మాట్లాడకుండా ఉండటం మంచిది కాదు. మా పిల్లలకు అలాంటి అలవాట్లు లేవని, మా పిల్లలు మంచి వాళ్లని భావిస్తూ వారితో చర్చింకుండా ఉండొద్దు. డ్రగ్స్‌ వాటి పర్యవసానాలను వారికి వివరించి వాటి జోలికి పోకుండా వారి బంగారు భవిష్యత్తుకు దోహద పడేలా తల్లిదండ్రులు కృషి చేయాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement