
ఉరివేసుకుని యువతి ఆత్మహత్య
భూదాన్‌పోచంపల్లి : కుటుంబ కలహాలతో మూడు నెలల గర్భవతి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన మంగళవారం సాయంత్రం భూదాన్‌పోచంపల్లి మున్సిపాలిటీ కేంద్రంలోని రాజీవ్‌కాలనీలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి మండలం శివపురం గ్రామానికి చెందిన చల్లా ధన్‌రాజ్–రేవతి కుటుంబం 20 ఏళ్ల క్రితం పోచంపల్లికి వలస వచ్చి మగ్గం నేస్తూ జీవనోపాధి పొందుతున్నారు. పక్క గ్రామమైన మీనవల్లుకి చెందిన శివపార్వతి (20) అనే యువతికి పోచంపల్లిలో అమ్మమ్మ దగ్గర ఉండి చదువుకుంటున్న సమయంతో ధన్‌రాజ్ కుమారుడు కృష్ణప్రసాద్‌తో పరిచయమైంది. దీంతో వారు నాలుగు నెలల క్రితం ఇంట్లో తెలియకుండా ఏపీకి పెళ్లి చేసుకుని వచ్చారు. కృష్ణప్రసాద్ స్థానికంగా ఓ కిరాణం షాపులో గుమస్తాగా పనిచేస్తుండగా, శివపార్వతి ఇంట్లోనే ఉంటోంది. కాగా శివపార్వతి మూడు నెలల గర్భవతి కావడంతో మంగళవారం ఉదయం భర్త ఆస్పత్రికి తీసుకెళ్లి చెకప్ చేయించి మధ్యాహ్నం డ్యూటీకి వెళ్లిపోయాడు. అత్తామామలు కూడా ఉదయమే పనికి వెళ్లారు. ఈ క్రమంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న శివపార్వతి ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సాయంత్రం అత్త ఇంటికి వచ్చి చూడగా లోపల నుంచి గొళ్లెం పెట్టి ఉంది. అనుమానం వచ్చి కిటికీలోంచి చూడగా శివపార్వతి ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. స్థానికులకు విషయం చెప్పి, వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చింది. ఎస్‌ఐ భాస్కర్‌రెడ్డి, ఆర్‌ఐ వెంకట్‌రెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని శవాన్ని కిందికి దించి పంచనామా నిర్వహించారు. అనంతరం మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు. శివపార్వతి తల్లి ఉపాధి కోసం కువైట్‌కు వెళ్లగా, తండ్రి పర్యవేక్షణలో పెరిగింది.
మృతురాలు
మూడు నెలల గర్భవతి