12 రోజులు.. వీడని వరద కష్టాలు | - | Sakshi
Sakshi News home page

12 రోజులు.. వీడని వరద కష్టాలు

Nov 14 2026 1:41 AM | Updated on Nov 14 2026 1:41 AM

పెనుమంట్ర: పెనుమంట్ర మండలంలోని గోస్తనీ మురుగు కాలువ, జీఅండ్‌వీ కెనాల్‌ పరీవాహక ప్రాంతంలోని ఎనిమిది గ్రామాల ప్రజలు 12 రోజులుగా వరద నీటిలోనే కొట్టుమిట్టాడుతున్నారు. ప్రభుత్వం పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో ముఖ్యంగా పెనుమంట్ర, సోమరాజు ఇల్లిందలపర్రు, మాముడూరు గ్రామ ప్రజలు బయటకు వెళ్లే దారిలేక దుర్గంధ వాతావరణంలో కాలం గడుపుతున్నారు. పెనుమంట్రలో క్షత్రియ యూత్‌, పిరమిడ్‌ ధ్యాన కేంద్రం మహిళా సంఘం ఆధ్వర్యంలో రోజూ 700 మంది పైగా బాధితులకు రెండు పూ టలా భోజనం అందిస్తున్నారు. ఎస్‌.ఇల్లిందలపర్రులో మాజీ ఎంపీపీ కర్రి వెంకట్‌ నారాయణరెడ్డి (వాసు రెడ్డి) ఆధ్వర్యంలో 300 మందికి పైగా బాధితులకు భోజనాలు వండి పెడతున్నారు.

ముంపులోనే ఆలయాలు : నత్తారామేశ్వరంలోని రామలింగేశ్వర స్వామి, జుత్తిగలోని సోమేశ్వర స్వామి ఆలయాలు పూర్తిగా జల దిగ్బంధంలోనే ఉన్నాయి. నీరంతా నల్లగా మారి దుర్వాసన వస్తున్నా.. పురోహితులు వెళ్లి నైవేద్యాలు సమర్పిస్తున్నారు. వరద నీరు ఎక్కడికక్కడే నిలిచిపోవడంతో ఆయా గ్రామాల్లో పారిశుద్ధ్యం పూర్తిగా క్షీణించింది. మురుగు, పంట కాలువలు కూడా కలుషిత నీటితో పొంగి పొర్లుతున్నాయి. వరిచేలు నీటిలోనే కుళ్లిపోయి దుర్గాసన వెదజల్లుతున్నాయి. పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నా ఈ ఎనిమిది గ్రామాల్లో ప్రభుత్వ యంత్రాంగం ఎటువంటి చర్యలు చేపట్టకపోవడంతో బాధితులు, రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ప్రభుత్వం తెల్లరేషన్‌ కార్డుదారులకు 10 కిలోల బియ్యంతో సరిపెట్టిందని అంటున్నారు. మొక్కుబడిగా ప్రథమ చికిత్స కేంద్రాల ఏర్పాటు చేసినా పూర్తిస్థాయిలో మందులు లేకపోవడంతో వృద్ధులు, ప్లిలలు ప్రైవేట్‌ ఆస్పత్రులకు వెళ్లడానికి వ్యయప్రయాసలు పడుతున్నారు. గోస్తనీ కాలువ నీటితో పరిసర ప్రాంతాలు దుర్గంధంగా మారాయి.

ఎస్‌.ఇల్లిందలపర్రులో తణుకు ప్రధాన రహదారిపై వరద నీరు

పెనుమంట్రలో మార్టేరు–తాడేపల్లిగూడెం స్టేట్‌ హైవేపై ముంపు

జుత్తిగలో కంచి కామాక్షి అమ్మవారి ఆలయంలో..

పెనుమంట్ర రాజీవ్‌ కాలనీలో పునరావాస కేంద్రం

పెనుమంట్రలో అంబేడ్కర్‌నగర్‌ ఎస్సీ కాలనీ

జల దిగ్బంధంలోనే పెనుమంట్ర, ఎస్‌.ఇల్లిందలపర్రు

పట్టించుకోని అధికార యంత్రాంగం

దాతల సహకారంతో బాధితులకు భోజన ఏర్పాట్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement