బాలికలకు పోక్సో రక్షణ | - | Sakshi
Sakshi News home page

బాలికలకు పోక్సో రక్షణ

Nov 14 2026 1:41 AM | Updated on Nov 14 2026 1:41 AM

బాలికలకు పోక్సో రక్షణ లే అవుట్లలో నిబంధనలు పాటించాలి పక్కాగా జనగణన ముంపు బాధితులకు నిత్యావసరాల అందజేత

భీమవరం: అమ్మాయిలకు పోక్సో చట్టం రక్షణగా ఉంటుందని భీమవరం ప్రిన్సిపల్‌ సివిల్‌ జడ్జి (జూనియర్‌ డివిజన్‌) సి.రమ్య అన్నారు. మండల న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో సురక్షిత బాల్యం–బాలల రక్షణ ఉద్యమం అనే నినాదంతో పోక్సో తదితర చట్టాలపై స్థానిక చింతలపాటి బాపిరాజు స్మారకోన్నత పాఠశాలలో శుక్రవారం న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. పోక్సో చట్టం కింద కేసు నమోదై నిరూపణ జరిగితే కఠిన శిక్షలు ఉంటాయని లైంగిక వేధింపులను ధైర్యంగా ఎదుర్కొని తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు సమాచారం ఇవ్వాలన్నారు. అలాగే టోల్‌ ఫ్రీ నంబర్లు 1098, 112, 100 ద్వారా పోలీసులకు సమాచారమివ్వాలని సూచించారు. ప్యానల్‌ న్యాయవాదులు బి.అంబేడ్కర్‌, పి.వెంకటరమణ, డీవీ ఉష, కె.సుబ్బరాజు, హెచ్‌ఎం బి. శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

కాళ్ల: పెదమిరంలోని అనధికార లేఅవుట్లను జాయింట్‌ కలెక్టర్‌ కేఆర్‌ కల్పశ్రీ శుక్రవారం పరిశీలించారు. లేఅవుట్లకు సంబంధించిన అనుమతులు, ప్రభుత్వ నిబంధనలు, నిర్దేశిత ప్రమాణాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. లేఅవుట్ల ఏర్పాటుకు సంబంధించి తీసుకున్న అనుమతులు, సంబంధిత రికార్డులు, భూముల వివరాలు, నిబంధనల అమలు తీరుపై అడిగి తెలుసుకున్నారు. లేఅవుట్లలో నిర్దేశించిన నిబంధనలు, ప్రమాణాలు తప్పనిసరిగా పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు . భూములకు సంబంధించిన రికార్డులు పక్కాగా, వాస్తవ వివరాలకు అనుగుణంగా ఉండాలని స్పష్టం చేశారు.

భీమవరం(ప్రకాశం చౌక్‌): జనగణన–2027 ప్రక్రియను సమర్థవంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులు సమగ్ర అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్‌ సీహెచ్‌ నాగరాణి తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌లో రెండో దశ జన గణన నిర్వహణపై అధికారులకు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ 2027 జనవరి 10 నుంచి 24 వరకు ప్రజలు స్వయంగా వివరాలు నమోదు చేసుకునే అవకాశం ఉందన్నారు. అలాగే ఇంటింటా జనాభా గణన (రెండో దశ) 2027 జనవరి 25 నుంచి ఫిబ్రవరి 28 వరకు నిర్వహిస్తామన్నారు. శిక్షణలో పొందిన అంశాలను క్షేత్రస్థాయిలో పొరపాట్లకు తావులేకుండా అమలు చేయాలని సూచించారు. జేసీ కేఆర్‌ కల్పశ్రీ, జనగణన సమన్వయకర్త డాక్టర్‌ జగన్నాథ్‌ మాజీ, జిల్లా జనగణన అధికారి బి.భాగ్యప్ప తదితరులు పాల్గొన్నారు.

ఆకివీడు: మండలంలో తు పాను, వరద బాధితులను ఆదుకునేందుకు చర్యలు చేపట్టామని తహసీల్దార్‌ దర్శి వంశీ తెలిపారు. ‘నల్లగా మారి.. దుర్గంధంతో నిండి..’ శీర్షికన ‘సాక్షి’లో శుక్రవారం ప్రచురించిన కథనానికి ఆయన స్పందించి ఆయా ప్రాంతాల్లో బాధితుల గుర్తింపు చర్యల్ని చేపట్టారు. వారం రోజులుగా మండలంలోని పలు ప్రాంతాల్లో ముంపునకు గురైన బాధితులు 532 మందికి 25 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, లీటరు మంచినూనె, బంగాళ దుంపలు, ఉల్లిపాయలు, పంచదార చొప్పున అందజేశామన్నారు. మండలంలో పెరిగిన ముంపు దృష్టా ఆయా ప్రాంతాల్లోని బాధితులను గుర్తించామని, మరో 378 మంది బాఽధితులకు సహాయం అందజేసేందుకు కలెక్టర్‌కు నివేదించామన్నారు. త్వరలోనే వారికీ నిత్యావసర సరుకులు అందిస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement