● పశ్చిమ మన్యంలో కలకలం ● పశువులపై దాడి.. అధికారుల అప్రమత్తం
బుట్టాయగూడెం: పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంలో పెద్ద పులి సంచారం మరోమారు కలవరపరుస్తోంది. జీలుగుమిల్లి మండలం కామయ్యపాలెం బీట్‌లోని జిళ్లెళ్లగూడెంలో శుక్రవారం వేకువజామున కె.వెంకటేష్ అనే రైతుకు చెందిన ఆవుపై దాడి చేసి పులి చంపిందనే సమాచారం తీవ్ర ఆందోళన కలిగించింది. రెండు రోజుల క్రితం వేలేరుపాడు మండలంలో కొంతూరు, నాగవరంలో సంచరించి అక్కడ ఒక ఆవు, రెండు లేగ దూడలపై దాడి చేసిన పెద్ద పులి, అక్కడ నుంచి తెలంగాణ ప్రాంతంలోనికి వెళ్లినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో గురువారం అశ్వారావుపేట మండలం గుమ్మడిపల్లి అటవీ ప్రాంతంలో ఉన్నట్టు పులికి అమర్చిన రేడియో టాలీ ట్రాకర్ సిగ్నల్ ద్వారా అటవీశాఖ అధికారులు గుర్తించారు. అయితే తెల్లవారే సరికి జిల్లాలోని జీలుగుమిల్లి మండలంలో ప్రవేశించి, ఆవుపై దాడి చేసి అదే ప్రాంతంలో మాటేసినట్టు తెలిసింది. రాత్రి సమయంలో పులి కదలికలు ప్రారంభమయ్యే అవకాశం ఉన్నందున అటవీ శాఖ అధికారులు గట్టి నిఘా ఏర్పాటుచేశారు. పులి అదే ప్రాంతంలో ఉంటుందా? లేక బుట్టాయగూడెం మండలం వైపు వస్తుందా అని అధికారులు అంచనా వేస్తున్నారు.
ప్రజలకు తప్పని భయాందోళనలు
పులి సంచారం, పశువులపై దాడులతో పశ్చిమ ఏజెన్సీ ప్రజలు భయపడుతున్నారు.


