తణుకు అర్బన్: మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల ఎంపికలో తణుకు టీడీపీ అధిష్టానానికి సొంత గూట్లోనే కుంపట్లు రాజుకున్నాయి. అభ్యర్థుల ఎంపిక కోసం నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా వచ్చిన ఐవీఆర్‌ఎస్ కాల్స్ వ్యవహారం ముఖ్య నేతల్లో చిచ్చురేపింది. తణుకు మున్సిపల్ చైర్మన్ రిజర్వేషన్ జనరల్ కాగా ముఖ్య నేతలు ఆశావహులుగా ఉన్నారు. ముఖ్యంగా ఆరుగురు నేతలు రేస్‌లో ఉండగా కేవలం ముగ్గురు పేర్లు మాత్రమే ఐవీఆర్‌ఎస్ కాల్స్‌లో ప్రజాభిప్రాయ సేకరణకు అడుగుతుండటంతో మిగిలిన వారికి చిర్రెత్తుకొచ్చింది. రెండు రోజులుగా ఐవీఆర్‌ఎస్ కాల్స్‌లో టీడీపీ చైర్మన్ అభ్యర్థులుగా బసవ వీవీఎస్ రామకృష్ణ, వంటెద్దు వీర వెంకట సురేంద్రకుమార్, కలగర వెంకటకృష్ణల పేర్లు మాత్రమే ప్రజాభిప్రాయం అడుగుతుండటం వివాదాస్పదమైంది. దీంతో తణుకులో ప్రజాప్రతినిధిని కలిసిన మిగిలిన ఆశావహులు తమ పేర్లు ఎందుకు లేవంటూ నిలదీయడం రసాభాసగా మారింది. బీసీ వర్గానికి చెందిన ముఖ్యనేత తన పేరు ఎందుకు పెట్టలేదని నిలదీయగా, జనరల్ కేటగిరీలో బీసీ వర్గానికి అవకాశం లేదనే సమాధానంతో చిర్రెత్తుకొచ్చిన సదరు బీసీ నేత బీసీలైన మమ్మల్ని ఓట్లకు మాత్రమే వాడుకుంటారా అంటూ లేచి వెళ్లిపోయారు.
నిలదీసిన వైనం
తమ నేత పేరుకు ఎందుకు ప్రాధాన్యమివ్వలేదని, చైర్మన్ అభ్యర్థిగా ప్రకటించాలంటూ పట్టణానికి చెందిన టీడీపీ ముఖ్య నేతకు చెందిన అభిమానులు ప్రజాప్రతినిధిని నిలదీశారు. ఓ సమయంలో తీవ్రంగా వాగ్వాదానికి చోటుచేసుకున్నట్టుగా సమాచారం. సదరు ముఖ్య నేతకు తణుకు పట్టణ మొట్టమొదటి టీడీపీ కుటుంబం పెద్దల మద్దతు మెండుగా ఉండటంతో ఈ ఎన్నికల్లో టీడీపీ పరిస్థితి ఏంటో తేలాల్సి ఉంది. ఈ కారణంగా రేసులో ఉన్న టీడీపీ నేతలు రెబెల్స్‌గా దిగుతారా లేదంటే తమపై చిన్నచూపు చూస్తున్నారనే నెపంతో వ్యతిరేకతతో రివర్స్ ఓటు వేస్తారా అనేది వేచి చూడాలి.
ఐవీఆర్‌ఎస్ షో
ప్రజాభిప్రాయ సేకరణ కోసం టీడీపీ నిర్వహించిన ఐవీఆర్‌ఎస్ కాల్స్ అంతా ట్రాష్ అని, ఇప్పటికే తణుకు అధిష్టానం ఒకరిని సిద్ధం చేసిందని వారికే సీటు ఇస్తుందనే విషయం పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. కేవలం రేసులో ఉన్న వారిని సంతృప్తిపరిచి తమ చేతుల్లో ఏమీ లేదంటూ కూటమి అధిష్టానం నిర్ణయం మేరకే అభ్యర్థి ఎంపిక జరిగినట్టుగా కలరింగ్ ఇచ్చేందుకేననే చర్చ కూడా సాగుతోంది. అభ్యర్థి ఎంపిక ప్రకటన తర్వాత ఆశావహల పయనం ఎటు ఉంటుందో వేచి చూడాల్సిందే.
ప్రజాభిప్రాయ సేకరణలో తమ పేర్లు ఎందుకు లేవని నిలదీత
బీసీలను ఓట్లకే వాడుకుంటారా అని ముఖ్యనేత మండిపాటు
రసాభాసగా మారిన పంచాయితీ
ఎదురు తిరిగిన వారిపై తీవ్రంగా మండిపడ్డ ప్రజాప్రతినిధి


