పంచాయతీల్లోనూ వేలం జోరు
భీమవరం : రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ధనప్రవాహం చర్చనీయాంశంగా మారింది. కూటమి ప్రభుత్వం ఎన్నికలను అత్యంత ఖరీదైన వ్యవహారంగా మార్చివేసిందని, రూ.కోట్లు ఖర్చు చేసే స్థోమత ఉంటేనే బరిలోకి దిగాలంటూ టీడీపీ, జనసేన, బీజేపీ స్థానిక అగ్రనాయకులు షరతులు విధిస్తున్నారని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. దీంతో ఏళ్ల తరబడి పార్టీ జెండాలు మోస్తూ ప్రజాసేవ చేయాలని ఆశిస్తున్న చోటామోటా నాయకులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు.
భీమవరం చైర్మన్ పీఠానికి రూ. 15 కోట్ల బేరం?
జిల్లా కేంద్రమైన భీమవరం మున్సిపాలిటీలో 52 వార్డులు, సుమారు 1,45,737 మంది ఓటర్లు ఉన్నారు. ఈ పీఠం జనరల్ మహిళకు రిజర్వ్ కావడం, పొత్తులో భాగంగా జనసేనకు దక్కడంతో ఆ పార్టీలో రాజకీయ వేడి రాజుకుంది. ఎన్నికల ఖర్చు సుమారు రూ. 20 కోట్ల వరకు అవుతుందని నియోజకవర్గ ముఖ్య నేతలు అంచనా వేస్తున్నారు. ముందుగా రూ. 15 కోట్లు తమ వద్ద డిపాజిట్ చేస్తేనే చైర్మన్ అభ్యర్థిత్వాన్ని పరిశీలిస్తామని తేల్చి చెప్పినట్లు సమాచారం. ఈ భారీ డిమాండ్‌తో కొందరు వెనుకడుగు వేయగా, ఒకరిద్దరు ఆశావహులు తమ ఆస్తులను అమ్మి, తాకట్టు పెట్టి సొమ్ము సిద్ధం చేసుకున్నట్లు పట్టణంలో జోరుగా ప్రచారం సాగుతోంది. ఇక కౌన్సిలర్ పదవి ఆశించే వారు సైతం వార్డుకు కనీసం రూ. 30 లక్షల పైబడి ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొందని అంటున్నారు.
జనసేనలో అసమ్మతి
పార్టీ కోసం కష్టపడి, ఆర్థికంగా ఖర్చు చేసిన పాత వారిని కాదని, ఇప్పటివరకు పార్టీతో సంబంధం లేని కొత్త వారికి పెద్దలు మక్కువ చూపడంపై జనసేన శ్రేణుల్లో అసమ్మతి చెలరేగుతోంది. మరోవైపు, భీమవరం చైర్మన్ పీఠం సంప్రదాయంగా తమకే దక్కుతోందని, ఈసారి కూడా ఆ పదవిని తమకే కేటాయించాలని కాపు సామాజికవర్గ నేతలు పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది.
కూటమిలో గుబులు
ఆస్తులమ్ముకుంటున్న కూటమిలోని ఆశావహులు
రూ. 15 కోట్ల డిపాజిట్ చేస్తేనే చైర్మన్ టికెట్ !
సర్పంచ్ పదవికి రెండు ఎకరాలు పంచాయతీకి ఇస్తానన్న నాయకుడు
జిల్లాలోని 20 మండలాల్లోని 407 గ్రామ పంచాయతీలకు నవంబర్, డిసెంబర్ నెలల్లో మూడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. అలాగే ఏడేళ్ల విరామం తర్వాత భీమవరం, పాలకొల్లు, తణుకు, తాడేపల్లిగూడెం మున్సిపాలిటీలకు నవంబర్‌లో ఎన్నికలు నిర్వహిస్తుండటంతో వైఎస్సార్‌సీపీ, టీడీపీ, జనసేన ఆశావహులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీలకు అతీతంగా జరగాల్సిన పంచాయతీ ఎన్నికల్లోనూ పట్టు సాధించేందుకు కూటమి నేతలు సర్పంచ్ పదవులకు వేలంపాటలు నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. నరసాపురం నియోజకవర్గ పరిధిలోని తీరప్రాంత గ్రామాల్లో ఇప్పటికే నాలుగైదు చోట్ల వేలంపాటలు జరిగినట్లు సమాచారం. భీమవరం నియోజకవర్గంలోని ఓ గ్రామంలో తనను ఏకగ్రీవంగా ఎన్నుకుంటే పంచాయతీకి రెండెకరాల పొలం రాసిస్తానని ఓ నాయకుడు బహిరంగంగా ప్రకటించగా, మరికొందరు గ్రామాభివృద్ధికి రూ. కోట్ల సొంత నిధులు ఇస్తామంటూ ముందుకు వస్తున్నారు. అభివృద్ధి, సంక్షేమమే ఎజెండా అని పైకి చెబుతున్నా, క్షేత్రస్థాయిలో భారీగా డబ్బు పంపిణీ చేస్తే తప్ప గెలుపు సాధ్యం కాదని కూటమి పెద్దలు భావిస్తుండటంతో ఈ ఎన్నికలు సామాన్య నాయకులకు అందని ద్రాక్షగా మారాయనే గుసగుసలు వినిపిస్తున్నాయి.


