పదకొండు రోజులుగా మురుగు నీటిలో నడుస్తూ, ముక్కుపుటాలు అదిరిపోయే దుర్గంధం మధ్య స్థానిక ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. అధికారులు మొక్కుబడిగా ఒక్కసారి బ్లీచింగ్ పౌడర్ చల్లి చేతులు దులుపుకోగా, మండల స్థాయి అధికారులు కనీసం కన్నెత్తి కూడా చూడలేదని స్థానికులు మండిపడుతున్నారు. గత తుపాను కారణంగా నీట మునిగిన లోతట్టు ప్రాంతాల్లో ఇప్పటికీ వర్షపు, మురుగు నీరు నిలిచి ఉందంటే అధికారుల పనితీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. నిల్వ ఉన్న నీరు తీవ్ర దుర్గంధం వెదజల్లుతుండటంతో ప్రజలు ఇళ్ల తలుపులు వేసుకుని బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. వెలివర్రు, చెరుకువాడ, యండగండి, వాండ్రం తదితర గ్రామాల్లోని పలు కాలనీలు ఇంకా ముంపులోనే ఉన్నాయి. పాఠశాల విద్యార్థులు, మహిళలు, కూలీలు తప్పనిసరి పరిస్థితుల్లో ఇదే మురుగు నీటిలో నడుచుకుంటూ పాఠశాలలకు, పనులకు వెళ్తున్నారు. ఫలితంగా ఇప్పటికే పలువురికి కాళ్లకు చర్మవ్యాధులు సోకి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
– ఉండి


