● 40 మంది నిరుపేదల నుంచి రూ.కోటికి పైగా వసూలు
● విజయవాడ, ఏలూరుకు చెందిన ఇద్దరి అరెస్ట్
అజిత్‌సింగ్‌నగర్ (విజయవాడసెంట్రల్): సొంతింటి కల నెరవేరుస్తామని ఇద్దరు కేటుగాళ్లు 40 మంది నుంచి కోటి పైగా వసూలు చేసి నిలువునా ముంచారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అజిత్‌సింగ్‌నగర్ డంపింగ్ యార్డ్ వెంబడి ఉన్న జేఎన్ఎన్యూఆర్ఎం అపార్ట్‌మెంట్స్‌లో బ్లాక్ నెంబర్ 44 ఎఫ్ఎఫ్ వన్‌లో కొల్లూరు నాగూర్‌బీ తన భర్త, ఇద్దరు కుమార్తెలతో ఎనిమిదేళ్ల నుంచి నివసిస్తోంది. అదే ప్రాంతానికి చెందిన దివ్యాంగుడు పుట్టపు సత్యనారాయణ అలియాస్ సతీష్ తాను సీఆర్డీఏలో పని చేస్తున్నానని, డంపింగ్ యార్డ్‌లో ఖాళీగా ఉన్న అపార్ట్మెంట్లలో తక్కువ ధరకే ఫ్లాట్ ఇప్పిస్తానని నమ్మించాడు. మాటలు నమ్మిన నాగూర్‌బీ 2019లో సత్యనారాయణకు రూ.3.20 లక్షలు, అతని మేనల్లుడు అల్లంపల్లి సాయిదుర్గామహేష్ అలియాస్ సాయికు మరో రూ.4.60 లక్షలు చొప్పున రూ.7.80 లక్షలు చెల్లించింది. 15 రోజుల తర్వాత సత్యనారాయణ పీఎంఏవై ఇల్లు పేరుతో దొంగ పట్టా కాగితాలను నాగూర్‌బీకి ఇచ్చాడు.
ఫింగర్ ప్రింట్స్ పేరుతో బురిడీ
సత్యనారాయణ ఇచ్చిన పట్టాలు నకిలీవని తెలియక నాగూర్‌బీ కుటుంబ సభ్యులు తమ స్నేహితులు, బంధువులకు చెప్పడంతో మరి కొందరు ఫ్లాట్ల కోసం రూ.కోటికి పైగా చెల్లించారు. వారికి అనుమానం రాకుండా సత్యనారాయణ ఈకేవైసీ చేయాలని రెండుసార్లు వారి ఫింగర్ ప్రింట్స్ తీసుకుని మభ్యపెడుతున్నాడు. ఈ ఏడాది ఆగస్టులో నాగూర్‌బీ, మరి కొందరు తమకు ఇచ్చిన డాక్యుమెంట్లో నంబరు ఫ్లాట్ వద్దకు వెళ్లగా వేరే ఎవరో ఉంటున్నారని, వారికి గతంలోనే ప్రభుత్వం మంజూరు చేసినట్లు తెలుసుకున్నారు. సత్యనారాయణ అతని మేనల్లుడు సాయిదుర్గ మహేష్ మోసం చేసినట్లు గ్రహించి అజిత్‌సింగ్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సీఐ దాడి చంద్రశేఖర్ దర్యాప్తు చేసి, 40 మందికి పైగా బాధితులు మోసపోయినట్లుగా పోలీసులు గుర్తించారు. పుట్టపు సత్యనారాయణ, సాయిదుర్గామహేష్ను గురువారం రాత్రి ఎస్సై శోభనాద్రి అరెస్ట్ చేసి వారి వద్ద మూడు సెల్ ఫోన్లు, కారును స్వాధీనం చేసుకున్నారు. నిందితులను జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించింది.
అల్లంపల్లి సాయి దుర్గా మహేష్
పుట్టపు సత్యనారాయణ


