మాయమైన పాతయేరు | - | Sakshi
Sakshi News home page

మాయమైన పాతయేరు

Nov 14 2026 1:35 AM | Updated on Nov 14 2026 1:35 AM

● మునిగిపోతున్న వందలాది ఎకరాల ఆయకట్టు

● పట్టించుకోని అధికారులు, ప్రజాప్రతినిధులు

ఆకివీడు: స్థానిక గుమ్ములూరు రోడ్డు నుంచి చినకాపవరం డ్రెయిన్‌ వరకు మురుగునీటి పారుదల నిమిత్తం ఏర్పాటు చేసిన ‘పాతయేరు’ కాలువ కనుమరుగవుతోంది. గత 30 ఏళ్లుగా ఈ కాలువను పట్టించుకోకపోవడంతో, సరిహద్దు రైతులు ఆక్రమించుకుని కాలువను కుచించుకుపోయేలా చేశారు. ఫలితంగా ఏటా మాదివాడ ఆయుకట్టు ముంపునకు గురై, వందలాది ఎకరాల్లో చేతికి అందివచ్చిన పంట నీటిపాలవుతోంది. భారీ వర్షాలకే కాదు, సాధారణ దుక్కి వర్షానికి కూడా పొలాలు నీట మునుగుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యంతో తాము లక్షలాది రూపాయల పెట్టుబడులు నష్టపోవాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. రికార్డుల్లో ఉన్న పాతయేరు అధికారుల దృష్టిలో ఉందో లేదో కూడా తెలియని దుస్థితి నెలకొంది. ప్రజాప్రతినిధులు సైతం దీని తవ్వకాలపై దృష్టి పెట్టకపోవడంతో ఆయుకట్టు రైతులు నిండా మునుగుతున్నారు. మాదివాడ ఆయుకట్టు భూముల నుంచి వచ్చే వ్యర్థ, వర్షపు నీరు పాతయేరు గుండా చినకాపవరం డ్రెయిన్‌లో కలిసి, అక్కడి నుంచి ఉప్పుటేరు ద్వారా సముద్రంలోకి వెళ్లాలి. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేకపోవడంతో ముంపునీరు చేలల్లోనే తిష్టవేస్తోంది. దీంతో వరి పంట పండాల్సిన చోట కలువపువ్వుల పంట పండుతోందని రైతులు ఎద్దేవా చేస్తున్నారు. ఈ ప్రాంతంలోని కొండయ్య చెరువు, గాలిబ్‌ చెరువులకు కూడా ఇదే డ్రెయిన్‌ అవుట్‌లెట్‌గా ఉందని వారు గుర్తుచేస్తున్నారు.

అడుగడుగునా ఆక్రమణలే..

పాతయేరు గుమ్ములూరు రోడ్డు నుంచి ప్రారంభమై ఆకివీడులోని చినకాపవరం డ్రెయిన్‌లో కలుస్తుంది. అయితే, కాలువ ప్రారంభంలోనే తీవ్ర ఆక్రమణకు గురైంది. ఆ ప్రాంతంలో డ్రెయిన్‌ను ఆక్రమించి ఏకంగా చెరువు తవ్వారని రైతులు వాపోతున్నారు. కాలువ వెంబడి ఉన్న సరిహద్దు భూముల యజమానులు చేసిన ఆక్రమణల కారణంగా ఇది కాస్తా కుంచించుకుపోయి, మురుగునీటి ప్రవాహానికి తీవ్ర ఆటంకం కలుగుతోంది. అధికారులు వదిలివేసినా, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోయినా ప్రకృతి మాత్రం తన పని తాను చేసుకుపోతోంది. కాలువ ఉన్నా లేకున్నా ముంపునీరు మాత్రం నేరుగా పొలాలపైకి చొచ్చుకొస్తోంది. ఇప్పటికై నా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి పాతయేరు తవ్వకం పనులు యుద్ధప్రాతిపదికన చేపట్టి, వందలాది ఎకరాల రైతులను ఆదుకోవాలని వేడుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement