జంగారెడ్డిగూడెం(బుట్టాయగూడెం): రెండు వేర్వేరు చెక్ బౌన్స్ కేసుల్లో ఒకే వ్యక్తికి జైలు శిక్ష, జరిమానా విధిస్తూ జంగారెడ్డిగూడెం జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ఈ. అన్నామణి శుక్రవారం తీర్పు వెలువరించారు. జక్కుల రమేష్ అనే వ్యక్తికి ఈ రెండు కేసుల్లో మూడేసి నెలల సాధారణ జైలు శిక్ష, రూ.10 వేల చొప్పున జరిమానా విధించారు. అలాగే బాధితులకు మొత్తం రూ.12.50 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించారు. 2019లో నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్ సెక్షన్ 138 కింద బెజవాడ కేశవులు దాఖలు చేసిన కేసులో నిందితుడికి మూడు నెలల జైలు శిక్ష, రూ.10 వేల జరిమానాతో పాటు కేశవులుకు రూ.5 లక్షల పరిహారం చెల్లించాలని తీర్పు చెప్పారు. అదేవిధంగా 2019లోనే డాక్టర్ కోట సుబ్బారావు దాఖలు చేసిన మరో చెక్ బౌన్స్ కేసులోనూ రమేష్‌కు మూడు నెలల జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా విధించి, సుబ్బారావుకు రూ.7.50 లక్షల పరిహారం చెల్లించాలని పేర్కొన్నారు. ఈ కేసుల్లో ఫిర్యాదుదారుల తరఫున సీనియర్ న్యాయవాదులు బుడిగిన నాగేంద్ర కుమార్, కామన సత్యం వాదనలు వినిపించారు.
చింతలపూడి: మండలంలోని ఫాతిమాపురంలో శుక్రవారం తెల్లవారుజామున చోరీ ఘటన చోటు చేసుకుంది. గ్రామంలోని వేలాంగణి మాత స్వరూపం వద్ద ఉన్న కానుకల పెట్టె తాళాలను గుర్తుతెలియని దుండగులు పదునైన ఆయుధాలతో పగలగొట్టి, భక్తులు సమర్పించిన నగదును అపహరించారు. ఉదయం ప్రార్థనల నిమిత్తం వచ్చిన గ్రామస్తులు పగిలి ఉన్న పెట్టెను గమనించి నిర్వాహకులకు సమాచారం అందించారు. ఘటనపై నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గ్రామంలో రాత్రి వేళల్లో పోలీసు గస్తీని పెంచి, నిందితులను తక్షణమే గుర్తించి కఠినంగా శిక్షించాలని స్థానికులు కోరుతున్నారు.
దేవరపల్లి: దొంగతనం కేసులో ఇద్దరు నిందితులకు న్యాయస్థానం జైలు శిక్ష విధించింది. ఎస్సై ఆంజనేయబాబు తెలిపిన వివరాల ప్రకారం నల్లజర్ల మండలం దూబచర్లలోని సెల్‌ఫోన్ షాపులో 2018లో జంగారెడ్డిగూడేనికి చెందిన పోలవరపు నాగ దుర్గాప్రసాద్, తాడేపల్లి చిట్టిబాబు దొంగతనానికి పాల్పడ్డారు. దీనిపై అప్పట్లో నల్లజర్ల పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. నేరం రుజువు కావడంతో తాడేపల్లిగూడెం ఫస్ట్ అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కె.లలితాదేవి శుక్రవారం నిందితులకు 6 నెలల జైలు శిక్ష, రూ.2 వేల చొప్పున జరిమానా విధించారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): స్థానిక జిల్లా కేంద్ర గ్రంథాలయంలో 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను శనివారం నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్నట్టు జిల్లా గ్రంథాలయ సంస్థకార్యదర్శి ఎం శేఖర్ బాబు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. వారోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు వివిధ అంశాల్లో పోటీలు నిర్వహిస్తామని, సాహిత్య సదస్సులు, సాంస్కృతిక, కళా ప్రదర్శనలు, పుస్తక ప్రదర్శనలు, కవి సమ్మేళనాలు, వివిధ అంశాలపై అవగాహన సదస్సులు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. 20న జరిగే ముగింపు కార్యక్రమంలో పోటీల్లో విజేతలకు బహుమతులు అందిస్తామని స్పష్టం చేశారు.


