ద్వారకాతిరుమల : శ్రీవారి క్షేత్రంలో చినవెంకన్న తెప్పోత్సవానికి ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శ్రీవారి పుష్కరిణి (నృసింహ సాగరం) సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. క్షీరాబ్ధి ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ నెల 21న రాత్రి స్వామివారి తెప్పోత్సవాన్ని వైభవంగా నిర్వహించేందుకు దేవస్థానం చర్యలు చేపట్టింది. పుష్కరిణి గట్లపై విద్యుద్దీపాలంకరణ పనులు చురుగ్గా సాగుతుండగా, బోరు నీటితో పుష్కరిణిని నింపుతున్నారు. ఉత్సవం రోజు రాత్రి స్వామివారు ఉభయ దేవేరులతో కలిసి తొళక్క వాహనంపై పురవీధుల్లో ఊరేగి, రాత్రి 8 గంటలకు పుష్కరిణి వద్దకు చేరుకుంటారని, అనంతరం తెప్పోత్సవం ప్రారంభమవుతుందని ఆలయ ఈఓ వేండ్ర త్రినాథరావు తెలిపారు. ఈ వేడుకలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొనాలని ఆయన కోరారు.


