కాపాడితేనే మనుగడ | - | Sakshi
Sakshi News home page

కాపాడితేనే మనుగడ

Nov 13 2026 12:22 AM | Updated on Nov 13 2026 12:22 AM

కాపాడితేనే మనుగడ పశుపోషణ కష్టమే పచ్చగడ్డిని మేపడంపై దృష్టి పెట్టాలి

వరుస తుపాన్లు రైతులను అన్నిరకాలుగా కోలుకోలేని దెబ్బతీశాయి. వరి పంట చేతికి వచ్చే సమయంలో ముంపు నీటిలో మునిగి కుళ్లిపోవడంతో కనీసం పెట్టుబడులు కూడా వచ్చే అవకాశం లేకుండా పోయింది. గడ్డి కుళ్లిపోవడంతో పశువుల పోషణకు దారి కన్పించడం లేదు. ఇప్పటికే పెరిగిన పశువుల దాణా ఖర్చులకు తోడు ఎండుగడ్డి కొరత ఏర్పడితే పశువులను ఎలా మేపాలో తెలియని పరిస్థితి నెలకొంది.

– పంజా శేషగిరిబాబు, రైతు, ముగ్గుళ్ల, గణపవరం మండలం

పాడి పశువులను పెంచే రైతులు ప్రత్యామ్నాయంగా పచ్చగడ్డిని మేతగా ఎక్కువగా ఉపయోగించాలి. భారీ వర్షాల కారణంగా అనేక ప్రాంతాల్లో పచ్చగడ్డి దెబ్బతిన్నప్పటికీ, త్వరితగతిన పచ్చగడ్డి మళ్లీ సిద్ధమయ్యే అవకాశం ఉన్నందున రైతులు దానిని వినియోగించుకోవాలి. అలాగే, తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న పశువుల దాణాను రైతులు సక్రమంగా వినియోగించుకోవాలి.

– డాక్టర్‌ ఆర్‌.కోటిలింగరాజు, పశుసంవర్ధక శాఖ జిల్లా జాయింట్‌ డైరెక్టర్‌, భీమవరం

భీమవరం : వరుస తుపాన్ల కారణంగా జిల్లాలో అన్నదాతలతోపాటు పాడిరైతులు కూడా తీవ్రంగా నష్టపోయారు. నీట మునిగిన పంటచేలు కుళ్లిపోవడంతో వరిగడ్డికి తీవ్ర కొరత ఏర్పడి, పశువుల పోషణ భారంగా మారుతోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత కొన్నేళ్లుగా పశువుల దాణా ఖర్చులు, ఇతర పెట్టుబడులు గణనీయంగా పెరిగిపోవడంతో పాడి పశువుల పోషణ కష్టంగా మారింది. వరి కోత యంత్రాల వినియోగం పెరగడంతో ఎండుగడ్డి ఉత్పత్తి తగ్గింది. యంత్రాలు గడ్డిని ముక్కలు ముక్కలుగా చేయడం వల్ల వాటిని గడ్డి వాములుగా వేసుకోవడానికి వీలు లేకుండా పోయింది. మరోవైపు పచ్చగడ్డి పెంచడానికి ఖాళీ భూములు అందుబాటులో లేకపోవడం రైతులకు మరింత ఇబ్బందికరంగా మారింది.

జిల్లాలో 2 లక్షల పశువుల పెంపకం

జిల్లాలో సుమారు 2 లక్షల పశువులు ఉండగా, దాదాపు 25 వేల వరకు మేకలు, గొర్రెలను కూడా పెంచుతున్నారు. సాధారణంగా ఒక గేదె లేదా ఆవుకు రోజుకు సుమారు 18 కిలోల గడ్డి అవసరమవుతుందని అంచనా. ఇటీవల వచ్చిన అర్నబ్‌, మురసు తుపాన్ల కారణంగా జిల్లాలో సుమారు 2 లక్షల ఎకరాల్లో వరి పంట దెబ్బతిన్నట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. సార్వా సీజన్‌లో జిల్లా వ్యాప్తంగా దాదాపు 2.20 లక్షల ఎకరాల్లో సాగు చేయగా.. మెరక ప్రాంతాలు మినహా మిగిలిన పంటంతా ముంపుబారిన పడింది. వర్షపు నీటిలో మునిగిన వరి పంట 15 రోజులు గడిచినా బయటకు వెళ్లకుండా నిలవడంతో పూర్తిగా కుళ్లిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంటతో పాటు గడ్డి కూడా కుళ్లిపోవడంతో పశువులకు ఎండుగడ్డి కొరత తలెత్తింది. దీనికి తోడు గతంలో రైతులు నిల్వ చేసుకున్న గడ్డివాములు సైతం వర్షపు నీటిలో మునిగి కుళ్లిపోయాయని వాపోతున్నారు.

పచ్చగడ్డి కోసం తప్పని పాట్లు

పాడి పశువులను పెంచే రైతులు ఎండుగడ్డితో పాటు ఎక్కువగా పచ్చగడ్డిని మేపుతుంటారు. పచ్చగడ్డి మేపడం వల్ల పాల ఉత్పత్తి పెరగడంతోపాటు పాలలో వెన్నశాతం కూడా పెరుగుతుంది. అయితే, ముంపు కారణంగా చేలగట్లు, పుంతల్లో నీరు నిలిచిపోయి పచ్చగడ్డి సైతం కుళ్లిపోయింది. అక్కడక్కడా మిగిలి ఉన్నా.. మురుగునీటి దుర్వాసన కారణంగా పశువులు వాటిని తినడం లేదని రైతులు చెబుతున్నారు.

అరకొరగానే ప్రభుత్వ సహాయం

తుపాన్ల ప్రభావిత ప్రాంతాల్లో పాడి రైతులకు ప్రభుత్వపరంగా పశువుల దాణా ఉచితంగా పంపిణీ చేస్తున్నప్పటికీ, అది అరకొరగానే అందుతోందని రైతులు వాపోతున్నారు. నరసాపురం నియోజకవర్గం మొత్తానికి కేవలం 85 టన్నుల దాణా మాత్రమే పంపిణీ చేశారని, ప్రభుత్వం ఇచ్చే ఈ సాయం కేవలం వారానికి కూడా సరిపోదని చెబుతున్నారు. ఎండుగడ్డి, పచ్చగడ్డి లేకుండా కేవలం దాణాతో మాత్రమే పశువులను పోషించడం చాలా కష్టమని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పశువుల దాణా ధరలు పెరిగిన నేపథ్యంలో పాల ధరలను కూడా పెంచాల్సి వస్తుందని, అదే జరిగితే సామాన్య ప్రజలపై తీవ్ర ప్రభావం పడుతుందని పేర్కొంటున్నారు.

పాడి గేదెలు

తుపాన్ల దెబ్బతో పశుగ్రాసం కొరత

పంట చేలు కుళ్లిపోవడంతో లభించని వరిగడ్డి

పచ్చగడ్డికీ గండమే

పెరిగిన దాణా ధరలతో పాడి రైతులు సతమతం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement