దీక్షలో దివ్య అనుభూతి
ఇతరులకు ఆదర్శం
స్వాముల సేవలోనే ఆత్మసంతృప్తి
ద్వారకాతిరుమల : కార్తీకమాసం.. ఆధ్యాత్మిక చింతనకు, భక్తిభావానికి ప్రతీక. ఈ పవిత్ర మాసంలో మాలధారణ చేసి, నియమనిష్టలతో దీక్ష సాగిస్తున్న స్వాములకు ఉచిత అన్నప్రసాదం అందిస్తూ ద్వారకాతిరుమలకు చెందిన చేబోలు రాజేష్ స్వామి సేవలో తరిస్తున్నారు. తాను స్వయంగా అయ్యప్ప దీక్షలో ఉంటూనే, తోటి దీక్షాధారులకు భిక్ష ఏర్పాటు చేయాలన్న సంకల్పంతో ఈ నిత్య అన్నదాన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కార్తీకమాసాన్ని పురస్కరించుకుని ఈ నెల 9న ప్రారంభమైన ఈ కార్యక్రమం మాసాంతం వరకు కొనసాగనుంది. క్షేత్రంలోని యాదవ కల్యాణ మండపం వెనుక ఉన్న విశాలమైన షెడ్డులో ప్రతిరోజూ వందలాది మంది స్వాములకు ఆత్మీయంగా భిక్ష అందిస్తున్నారు.
ఎంతమంది స్వాములకై నా స్వాగతం
ప్రతిరోజూ మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమయ్యే ఈ భిక్ష కార్యక్రమంలో పాల్గొనే మాలధారుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ప్రస్తుతం నిత్యం 100 నుంచి 150 మంది వరకు భిక్ష స్వీకరిస్తున్నారు. ఎంతమంది స్వాములు వచ్చినా లోటులేకుండా భిక్ష ఏర్పాటు చేస్తామని రాజేష్ స్వామి చెబుతున్నారు. కేవలం అయ్యప్ప మాలధారులే కాకుండా.. భవానీ, శివ, గోవింద మాలధారులతోపాటు ఇతర దీక్షాధారులకూ ఈ అవకాశం కల్పిస్తున్నారు. ఎంతో రుచికరమైన వంటకాలతో భిక్ష అందిస్తున్నారు. స్వాములు ముందుగా అక్కడ కొలువైన అయ్యప్ప స్వామిని దర్శించుకుని పూజలు నిర్వహిస్తున్నారు. హారతులిచ్చి, భజనలు చేస్తూ స్వామి నామస్మరణలో మునిగితేలుతున్నారు.
ద్వారకాతిరుమలలో నిత్యం మాలధారులకు ఉచిత భిక్ష
రోజూ 100 నుంచి 150 మంది స్వాములు భిక్ష స్వీకరణ
ఎంతమంది వచ్చినా ఏర్పాటు చేస్తామంటున్న రాజేష్ స్వామి
కార్తీకమాసం ఆఖరి వరకు కొనసాగనున్న కార్యక్రమం
మాలధారణ సమయంలో నియమనిష్టలతో పాటు భక్తిభావాన్ని పెంపొందించుకోవడం ఎంతో ముఖ్యం. ఇక్కడికి వచ్చి అయ్యప్ప స్వామిని దర్శించుకుని, భజనలు, సంకీర్తనల్లో పాల్గొన్న అనంతరం భిక్ష స్వీకరించడం, వివిధ ప్రాంతాల మాలధారులు ఒకచోట చేరి ఆధ్యాత్మిక భావాలను పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. – బల్లా మునేశ్వరరావు,
గోవింద దీక్షాదారుడు, గుండుగొలనుకుంట
స్వాములకు ఉచిత భిక్ష వితరణ కార్యక్రమం అభినందనీయం. దూర ప్రాంతాల నుంచి క్షేత్రానికి వచ్చే దీక్షాధారులకు ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంది. పూజలు, భజనలు నిర్వహించిన అనంతరం భిక్షను స్వీకరించడం మంచి ఆధ్యాత్మిక అనుభూతిని ఇస్తోంది. రాజేష్ స్వామి సేవా దృక్పథం ఇతరులకు ఆదర్శంగా నిలుస్తుంది.
– తుమ్మల సంతోష్,
అయ్యప్ప దీక్షాదారుడు, దొరసానిపాడు
కార్తీకమాసంలో దీక్ష సాగిస్తున్న స్వాములకు సేవ చేసే అవకాశం రావడం నా పూర్వజన్మ సుకృతం. స్వాములకు భిక్ష ఏర్పాటు చేయడం ద్వారా నాకు ఎంతో ఆత్మసంతృప్తి కలుగుతోంది. అయ్యప్ప, భవానీ, శివ, గోవింద తదితర మాలధారులందరూ ఈ పవిత్ర అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. – చేబోలు రాజేష్ స్వామి, ద్వారకాతిరుమల


