తణుకు అర్బన్: యువతి అదృశ్యంపై కేసు నమోదు చేసినట్లు తణుకు రూరల్ ఎస్సై నాళం శ్రీనివాసరావు తెలిపారు. తణుకు మండలం పైడిపర్రుకు చెందిన ధవళ సుహాశ్రీ (19) కనిపించడంలేదని తల్లి హేమప్రభ ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. రెండు నెలల క్రితమే సుహాశ్రీకి విజయవాడ వాస్తవ్యుడితో వివాహం కాగా ఈనెల 11వ తేదీ రాత్రి 9 గంటల సమయంలో అత్తవారి ఇంటికి వెళ్తున్నట్లుగా చెప్పి ఇంటి నుంచి బయలుదేరి వెళ్లిందని, అప్పటి నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుండడంతో బంధువులు, స్నేహితులను ఆరా తీసి చివరకు ఫిర్యాదుచేసినట్లుగా ఎస్సై వివరించారు.
దెందులూరు : సోమవరప్పాడు జాతీయ రహదారి బ్రిడ్జి కింద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ ద్విచక్ర వాహనం పూర్తిగా దగ్ధమైంది. పెదవేగి మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన రేషన్ డీలర్ మేక మోహన వెంకట సుబ్రహ్మణ్యేశ్వరరావు ఏలూరులో పని ముగించుకుని ద్విచక్ర వాహనంపై తిరిగి వస్తుండగా, ఆశ్రమం ఆసుపత్రి వైపు నుంచి సర్వీస్ రోడ్డులోకి అతివేగంగా, నిర్లక్ష్యంగా వచ్చిన కారు ఆయన బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహన ఇంధన ట్యాంకుకు రంధ్రం పడటంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించి, వాహనం పూర్తిగా కాలిపోయింది. సమాచారం అందుకున్న ఏలూరు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ప్రమాదంలో స్వల్ప గాయాలైన బాధితుడిని చికిత్స నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన కారు వివరాలను సేకరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సీసీ టీవీ పుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు.
ఏలూరు (ఆర్ఆర్పేట): రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ సైక్లింగ్ పోటీల్లో పాల్గొనే అండర్ 17, అండర్ 14 జిల్లా బాలబాలికల జట్ల ఎంపికలు ఈ నెల 14వ తేదీన నిర్వహించన్నుట్టు జిల్లా విద్యాశాఖాధికారి ఎం. వెంకట లక్ష్మమ్మ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఎంపికలు జంగారెడ్డిగూడెం జిల్లా పరిషత్బాలుర ఉన్నత పాఠశాలలో జరుగుతాయని తెలిపారు. జిల్లాలోని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, పీడీలు, పీఈటీలు సంబంధిత క్రీడాకారులకు సమాచారం అందించి నిర్ణీత తేదీలో అవసరమైన క్రీడా సామగ్రి, పాఠశాల ధ్రువీకరణ పత్రాలతో హాజరయ్యేలా చూడాలని ఆదేశించారు.
బుట్టాయగూడెం : ఏజెన్సీ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షానికి గుబ్బల మంగమ్మ తల్లి జల్లేరు జలాశయంలోకి భారీగా వరదనీరు వచ్చి చేరింది. కొండలపై కురిసిన వర్షాల కారణంగా బుట్టాయగూడెం మండలం దొరమామిడి సమీపంలోని ఈ ప్రాజెక్టులోకి నీటి ప్రవాహం పెరిగింది. జలాశయంలోకి నిరంతరం చేరుతున్న నీటిని నియంత్రించేందుకు గురువారం రాత్రి ఇరిగేషన్ అధికారులు రెండు గేట్లు ఎత్తి, స్పిల్ వే ద్వారా 300 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 217.80 మీటర్లు కాగా, ప్రస్తుతం నీటిమట్టం 217.15 మీటర్లుగా ఉంది. అలాగే జలాశయానికి ప్రస్తుత ఇన్ఫ్లో 29 క్యూసెక్కులుగా ఉన్నట్లు ఎంఐ ఏఈ సురేష్ తెలిపారు.
కుక్కునూరు: మండలంలో గురువారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. వివరాల ప్రకారం.. వెంకటాపురం ఎస్సీ కాలనీకి చెందిన గండూరి తిరుమలరావు (26) బైక్పై వెళ్తుండగా గ్రామ సమీపంలో మరో ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. దీంతో రోడ్డుపై పడిపోయిన అతడిపై అటుగా వెళ్తున్న లారీ వెళ్లడంతో తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తిరుమలరావును 108 వాహనంలో బూర్గంపాడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. అలాగే ఇదే గ్రామానికి చెందిన కొండా నరేష్ (25) వేలేరు సమీపంలోని కిన్నెరసాని వంతెన వద్ద బైక్ అదుపుతప్పి కిందపడటంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. అతడిని ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.


