ఏలూరు టౌన్ : ఏలూరు పరిసర ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ ప్రత్యేక శ్రద్ధ వహించారు. ఇటీవల 16 ఏళ్ల బాలిక బస్సు ప్రమాదంలో మరణించడంపై తీవ్రంగా స్పందించిన ఆయన, విద్యార్థుల సురక్షిత ప్రయాణంపై క్షేత్రస్థాయిలో పర్యటించి అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. విద్యాసంస్థలకు దూర ప్రాంతాల నుంచి వస్తున్న విద్యార్థుల రవాణాపై అధికారులతో సమగ్రంగా చర్చించామన్నారు. విద్యార్థులను తరలించేందుకు అధిక సంఖ్యలో బస్సులు ఏర్పాటు చేయడంతో పాటు, వాహనాల కండిషన్, డ్రైవర్ల బాధ్యతాయుత డ్రైవింగ్, వేగ నియంత్రణ, బస్సులు ఆపే ప్రదేశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. నగరంలో తరచూ ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి లోపాలను సరిదిద్దాలని, విద్యార్థులు రోడ్డు దాటేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వ శాఖలన్నీ సమన్వయంతో పనిచేసి రోడ్డు ప్రమాదాలను నివారించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్‌టీసీ డిపో మేనేజర్ వాణి, డీటీసీ ఎస్‌కే కరీం, డీఎస్పీ శ్రావణ్‌కుమార్, సీఐలు కోటేశ్వరరావు, లక్ష్మణరావు, ఆర్‌అండ్‌బీ డీఈ శ్రీకర్, సీఆర్‌ఆర్ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్, టీడీఆర్‌బీ అధికారులు పాల్గొన్నారు.


