కై కలూరు: అర్నబ్, మురసు వరుస తుపానుల దెబ్బకు ఆటపాక పక్షుల కేంద్రం కళావిహీనంగా మారింది. చెరువు చుట్టూ గట్లు కోతకు గురయ్యాయి. ఈదురు గాలులకు పర్యావరణ కేంద్రం రేకులు విరిగిపడ్డాయి. షికారు బోటు పైకప్పు ఊడిపడింది. పక్షుల కేంద్రం ప్రారంభంలో ఉన్న పెలికాన్ ప్యారడైజ్ ఇనుప బోర్డు కుప్పకూలింది. రాత్రి సమయంలో ఈ ఘటన జరగడంతో పెనుముప్పు తప్పింది. ఇటీవల పక్షుల విహార చెరువు గట్లకు మరమ్మతులు చేసి, మట్టి కోతకు గురికాకుండా వెదురు తడికలను ఏర్పాటు చేశారు. తుపానుల వల్ల అవి కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి.
బోటు షికారు నిలిపివేత
పక్షి ప్రేమికుల స్వర్గధామంగా పేరుగడించిన ఆటపాక పక్షుల కేంద్రం చెరువు 287 ఎకరాల్లో విస్తరించి ఉంది. స్వదేశీ, విదేశీ పక్షుల విడిది కోసం అటవీశాఖ చెరువులో కృత్రిమ ఇనుప స్టాండ్లను ఏర్పాటు చేసింది. తుపానుల తాకిడికి కొన్ని ఇనుప స్టాండ్లు నేలకూలాయి. ప్రధానంగా టికెట్టు కౌంటరు నుంచి ఈఈసీ కేంద్రం వాచ్‌టవర్ వరకు నీరు చేరింది. తుపానుల నేపథ్యంలో బోటు షికారును నిలిపివేశారు. ఇతర ప్రాంతాల నుంచి పక్షుల కేంద్రం వీక్షణకు వస్తున్న పర్యాటకులు నిరాశగా వెనుతిరుగుతున్నారు.
కొంపముంచుతున్న పోల్‌రాజ్ డ్రెయిన్
ఆటపాక పక్షుల కేంద్రం చెరువు సమీపంలో నాగరాజు కాల్వగా పిలిచే పోల్‌రాజ్ డ్రెయిన్ ఉంది. ప్రతిఏటా వరదల సమయంలో ఇది ఉధృతంగా ప్రవహిస్తోంది. పక్షుల కేంద్రం గట్టు డ్రెయిన్ నీటి ప్రవాహానికి కోతకు గురవుతోంది. ఒక్కసారిగా చెరువులోకి నీరు చేరడంతో గట్లు దెబ్బతింటున్నాయి. ప్రతిఏటా చెరువు ఎండిపోవడం, వరదల సమయంలో గట్లు దెబ్బతినడం జరుగుతోందని, పూర్తిస్థాయిలో గట్లను పటిష్టపరచాలని పక్షి ప్రేమికులు కోరుతున్నారు.
అనువైన సమయంలో అడ్డంకులు
ప్రతిఏటా శీతాకాలంలో విదేశాల నుంచి అరుదైన పక్షులు ఆటపాక పక్షుల కేంద్రానికి వలస వస్తాయి. సంతానోత్పత్తి జరుపుకొని మార్చిలో ఇవి స్వస్థలాలకు తరలివెళతాయి. ప్రస్తుతం విదేశీ పక్షులతో ఆటపాక కేంద్రం కళకళలాడుతోంది. పర్యాటకులకు ఇదే అనువైన కాలం. ఇటువంటి సమయంలో వరుస తుపానుల వల్ల కేంద్రం దెబ్బతింది. పూర్తిస్థాయిలో చెరువు గట్లకు మరమ్మతులు చేయాలని అటవీ అధికారులు ప్రణాళికలు రూపొందించినప్పటికీ, అవి అమలకు నోచుకోలేదు. తక్షణమే ఆటపాక పక్షుల కేంద్రాన్ని మరమ్మతు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
కోతకు గురైన చెరువు గట్లు
గాలులకు ఊడిపడిన ప్రారంభ బోర్డు, రేకులు
నిలిచిన బోటు షికారు
నిరాశగా వెనుతిరుగుతున్న పర్యాటకులు


