● గణపవరం బొబ్బిలి వంతెనపై ఢీకొన్న మోటార్‌సైకిళ్లు
● ఒకరి మృతి, మరో ఇద్దరికి గాయాలు
గణపవరం: కూలిపనికి వెళ్లి తిరిగి ఇంటికి వస్తున్న ఒక వ్యక్తి రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. మంగళవారం మధ్యాహ్నం గణపవరం బొబ్బిలి వంతెనపై రెండు మోటార్‌సైకిళ్లు ఢీకొన్న ఘటనలో ఒక వ్యక్తి మృతి చెందరగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గణపవరం ఎస్సై ఆకుల మణికుమార్ తెలిపిన వివరాల ప్రకారం నిడమర్రు మండలం ఛానమిల్లి గ్రామానికి చెందిన నక్కా మావుళ్లు మరికొందరితో కలిసి గణపవరం గాంధీనగర్‌లోని రొయ్యల చెరువుల వద్దకు కూలిపనికి వెళ్లాడు. పని ముగించుకుని మధ్యాహ్నం అదే గ్రామానికి చెందిన గండికోట ప్రభుదాస్‌తో కలిసి మోటార్‌సైకిల్‌పై ఇంటికి బయలుదేరాడు. వీరు ప్రయాణిస్తున్న బైక్ సరిగ్గా గణపవరం బొబ్బిలి వంతెనపైకి వచ్చేసరికి, ఎదురుగా అతివేగంగా, నిర్లక్ష్యంగా స్పోర్ట్స్ మోటార్‌సైకిల్‌పై వచ్చిన బండి ప్రేమ్‌కుమార్ అనే యువకుడు వీరు వెళ్తున్న బైక్‌ను బలంగా ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో మోటార్‌సైకిల్ నడుపుతున్న మావుళ్లు ఎగిరి రోడ్డుపై పడటంతో.. తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్ వెనుక కూర్చున్న ప్రభుదాస్‌కు, అలాగే ఎదురుగా వచ్చి ఢీకొన్న ప్రేమ్కుమార్కూడా గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను గణపవరం పీహెచ్‌సీకి తరలించగా, అప్పటికే మావుళ్లు మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. మెరుగైన వైద్యం కోసం గాయపడిన ప్రభుదాస్‌ను భీమవరం ఆసుపత్రికి, ప్రేమ్‌కుమార్‌ను తాడేపల్లిగూడెం ఆసుపత్రికి తరలించారు. మృతుడి భార్య యశోద ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మణికుమార్ తెలిపారు. మృతుడు మావుళ్లుకు ఇంటర్ చదువుతున్న కుమార్తె, 8వ తరగతి చదువుతున్న కుమారుడు ఉన్నారు. తండ్రి మరణవార్త విన్న పిల్లలు పాఠశాలల నుంచి వచ్చి, నిర్జీవంగా పడి ఉన్న తండ్రి మృతదేహాన్ని చూసి బోరున విలపించడం చూపరులను కలచివేసింది.


