ఏలూరు (టూటౌన్): ఏలూరు అటవీ డివిజన్ కార్యాలయంలో రాష్ట్ర అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవం మంగళవారం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా అటవీ అధికారి పీవీ సందీప్ రెడ్డి ఇతర అధికారులతో కలిసి అమరవీరుల స్మారక ఫలకం వద్ద ఘనంగా నివాళులర్పించి, రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అటవీ సంపదను, వన్యప్రాణులను కాపాడటంలో ప్రాణాలర్పించిన వీర జవాన్ల త్యాగాలు శాఖలోని ప్రతి ఒక్కరికీ నిత్య స్ఫూర్తిదాయకమన్నారు. అమరుల ఆశయాలకు అనుగుణంగా భావితరాలకు పచ్చని ప్రకృతిని అందించేందుకు అందరూ అంకితభావంతో పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. అనంతరం సిబ్బంది అటవీ, వన్యప్రాణి రక్షణ ప్రతిజ్ఞ చేశారు. పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు అధికారులు, సిబ్బంది అమరవీరుల సంస్మరణ బ్యానర్లతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు అటవీ శాఖ అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


