తణుకు అర్బన్: తణుకు మండలం దువ్వ రెగ్యులేటర్ వద్ద వరద నీటి ప్రవాహం ఇంకా ప్రమాద ఘంటికలు మోగిస్తూనే ఉంది. ఎగువ ప్రాంతాల నుంచి ఎర్రకాలువ ద్వారా వయ్యేరులోకి వస్తున్న నీటి ప్రవాహ తాకిడి కొనసాగుతుండడంతో దువ్వ రెగ్యులేటర్ ఇప్పటికీ ప్రమాదకర పరిస్థితుల్లోనే ఉంది. భారీగా వస్తున్న వరద నీటిని నాలుగు గేట్లు ఎత్తి దిగువకు వదిలిపెడుతున్నప్పటికీ, నీటిమట్టం తగ్గడం లేదు. రెగ్యులేటర్ సామర్థ్యం 15 అడుగులు కాగా, ప్రస్తుతం ఏకంగా 32.5 అడుగుల ఎత్తులో నీరు ప్రవహిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది.
గ్రామస్తుల భయాందోళన
శుక్రవారం 22,600 క్యూసెక్కులుగా ఉన్న ప్రవాహం, నేడు స్వల్పంగా తగ్గి 22 వేల క్యూసెక్కులకు చేరిందని జలవనరుల శాఖ అధికారులు తెలిపారు. అయినప్పటికీ రెగ్యులేటర్ వద్ద పరిస్థితులు చూస్తుంటే ఏదైనా ఉపద్రవం ముంచుకొస్తుందేమోనని గ్రామస్తులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. వయ్యేరుకు గండి పడే అవకాశాలు ఉన్నాయంటూ ఆందోళన చెందుతున్నారు. అయితే, వర్షాలు తగ్గుముఖం పట్టడంతో వయ్యేరులో నీటి ప్రవాహం సాధారణ స్థితికి రావడానికి మరో రెండు రోజులు పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
జాతీయ రహదారిపైకి
చొచ్చుకొచ్చిన వరద నీరు
దువ్వ గ్రామ పరిధిలో తాడేపల్లిగూడెం నుంచి తణుకు వైపు వచ్చే జాతీయ రహదారి కొంతమేర నీట మునిగింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతుండగా, కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. తణుకు నుంచి తాడేపల్లిగూడెం వైపు వెళ్లే రహదారిలోని జిల్లా పరిషత్ హైస్కూలు వద్ద రోడ్డుపై భారీగా నీరు ప్రవహిస్తుండటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గ్రామస్తులు సైతం బయటకు రాలేక, నిత్యావసరాలు, ఇతర సామాగ్రి అందక అవస్థలు పడుతున్నారు.
దువ్వకు పోటెత్తుతున్న వరద నీరు
భయాందోళనలో గ్రామస్తులు
దువ్వ జాతీయ రహదారిని ముంచేసిన వరద
రాకపోకలకు అంతరాయం


