పెంటపాడు: అర్నబ్, మురసు తుపాన్ల ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు ఇంకా నేటికీ కొన్ని కాలనీలు ముంపునీటిలోనే ఉన్నాయి. కొండేపాడు, రామచంద్రపురం ఉమామహేశ్వరం, గ్రామాల్లోని యనమదుర్రు డ్రెయిన్ పొంగిపారడంతో కాలనీలలోకి నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొండేపాడులో ఇటీవల కూటమి ప్రభుత్వం నూతనంగా నిర్మించిన డ్రెయినేజీ వ్యవస్థ సక్రమంగా పనిచేయకపోవడంతో మురుగునీరు రహదారులపై నిలిచిపోయింది. రామచంద్రపురం ఎస్సీపేటలో నాలుగు రహదారులు నీట మునిగాయి. శనివారం నాటికి కూడా వరదనీరు తగ్గకపోవడంతో నివాసితులు ఇళ్ల నుంచి బయటకు రాలేకపోతున్నారు. తుపాను బాధితులకు ప్రభుత్వం కార్డుకు పది కేజీల చొప్పున బియ్యం అందించాల్సి ఉండగా, ఇప్పటివరకు మండలంలో కనీసం 40 శాతం మందికి కూడా ఉచిత బియ్యం అందలేదు. కేవలం కొందరికి మాత్రమే బియ్యం ఇచ్చి చేతులు దులుపుకొంది. మరోవైపు అధికారులు, కూటమి నాయకులు ఎన్నికల హడావుడిలో నిమగ్నమై ఆ గ్రామాల వైపు కన్నెత్తి కూడా చూడలేదని అక్కడి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.


