● రూ.18.73 లక్షల సొమ్ము గుర్తింపు, అక్రమాస్తులపై నిఘా
● ఏలూరు ఏసీబీ డీఎస్పీ జీవీ కృష్ణారావు వెల్లడి
ఏలూరు టౌన్: ఏలూరు కాలుష్య నియంత్రణ మండలి ఎన్విరాన్‌మెంట్ ఇంజనీర్ ఏ. సీతారామచంద్రమూర్తి ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆయన వద్ద ఏమైనా అక్రమాస్తులు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు ఏలూరు రేంజ్ ఏసీబీ డీఎస్పీ జీవీ కృష్ణారావు తెలిపారు. ఏలూరు నవాబ్‌పేట కాలనీకి చెందిన మత్తే బాబి అనే వ్యక్తి ద్వారకాతిరుమల మండలం తిమ్మాపురం గ్రామంలో వేర్‌హౌస్ (గోడౌన్) నిర్మాణం కోసం నిరభ్యంతర పత్రం (ఎన్‌వోసీ) కోరుతూ దరఖాస్తు చేసుకున్నారు. ఎన్‌వోసీ మంజూరు చేయడానికి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎన్విరాన్‌మెంట్ ఇంజనీర్ సీతారామచంద్రమూర్తి లంచం డిమాండ్ చేశారు. తొలుత రూ. లక్ష డిమాండ్ చేయగా, చివరకు రూ.30 వేలు లంచం తీసుకుంటూ శుక్రవారం ఏలూరులోని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కార్యాలయంలో ఆయన ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఈ నేపథ్యంలోనే కాలుష్య నియంత్రణ మండలి అధికారి ఇంట్లో మధ్యవర్తుల సమక్షంలో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. ఈ తనిఖీల్లో రూ. 18,73,500 అనధికార నగదుతో పాటు 11 కాసుల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు ఏలూరు రేంజ్ ఏసీబీ డీఎస్పీ కృష్ణారావు వెల్లడించారు.


