ఆకివీడు: స్థానిక ఎస్–టర్నింగ్ సమీపంలో సచివాలయం వెనుక ఉన్న తాళ్లకొట్టు గోడౌన్లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం లక్కంశెట్టి హరిబాబుకు చెందిన తాళ్లకొట్టు గోడౌన్లో శనివారం సాయంత్రం మంటలు ఎగసిపడ్డాయి. స్థానికులు గుర్తించి వెంటనే అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. అప్పటికే గోడౌన్లోని వస్తువులు దగ్ధం కావడంతో తీవ్రస్థాయిలో దట్టమైన పొగ కమ్ముకుంది. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో సుమారు ఐదు లక్షల రూపాయల విలువైన వస్తువులు కాలి బూడిదయ్యాయి. ప్రమాదానికి గల కారణాలపై అగ్నిమాపక అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.


