న్యూస్‌రీల్
20 జెడ్పీటీసీ.. 340 ఎంపీటీసీ స్థానాలు
కౌంటింగ్ సాగేదిలా..
శనివారం శ్రీ 7 శ్రీ నవంబర్ శ్రీ 2026
సాక్షి, భీమవరం: జిల్లా, మండల పరిషత్ ఓట్ల లె క్కింపునకు సర్వం సిద్ధమైంది. భీమవరం రెవెన్యూ డివిజన్ పరిధిలోని జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు ఎస్‌ఆర్‌కేఆర్ కళాశాల, నరసాపురం రెవెన్యూ డివిజన్‌లోని వాటికి వైఎన్ కళాశాల, తాడేపల్లిగూడెం డివిజన్‌లోని వాటికి ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయంలో ఓట్లు లెక్కించనున్నారు. ఈ మేరకు మూడు కేంద్రాల్లో మొత్తం 219 టేబుళ్లను అధికారులు ఏర్పాటుచేశారు.
మూడు కేంద్రాల్లో.. బ్యాలెట్ బాక్సులు భద్రపరిచిన భీమవరం ఎస్‌ఆర్‌కేఆర్, నరసాపురం వైఎన్ కళాశాల, తాడేపల్లిగూడెం ఆదికవి నన్నయ్య యూనివర్సిటీల్లో మండలాల వారీగా ఓట్లు లెక్కింపు కోసం అధికారులు ఏర్పాట్లు చేశారు. జిల్లాలో 20 మండలాలకు గాను మూడు కేంద్రాల్లోను మొత్తం 219 టేబుళ్లను ఏర్పాటుచేశారు. ఒక్కో మండలానికి పోలింగ్ కేంద్రాలు, ఓటర్ల సంఖ్యను బట్టి ఆరు నుంచి 22 వరకు టేబుళ్లను ఏర్పాటుచేశారు. ఆచంట, ఆకివీడు మండలాలకు ఆరు చొప్పున టేబుళ్లు ఏర్పాటుచేయగా, యలమంచిలి, పాలకొల్లు, పాలకోడేరు, వీరవాసరం మండలాలకు ఏడు చొప్పున, తణుకు, పోడూరు, పెనుమంట్ర, పెనుగొండ, కాళ్ల మండలాలకు పది చొప్పున, ఉండి మండలానికి 11, పెంటపాడు, నరసాపురం, మొగల్తూరు, ఇరగవరం, గణపవరం మండలాలకు 12 టేబుళ్లు చొప్పున, అత్తిలి, భీమవరం మండలాలకు 18 చొప్పున, తాడేపల్లిగూడెం రూరల్‌కు 22 టేబుళ్లను ఏర్పాటుచేశారు. టేబుల్‌కు ఒక కౌంటింగ్ సూపర్‌వైజర్ (సీఎస్) చొప్పున 219 మందిని నియమించారు. మొత్తం 671 మంది కౌంటింగ్ అసిస్టెంట్లను నియమించగా టేబుల్‌కు ముగ్గురు నుంచి నలుగురు విధులు నిర్వర్తించనున్నారు. రిజర్వులో సీఎస్‌లు 45 మంది, కౌంటింగ్ అసిస్టెంట్లు 140 మంది ఉన్నారు.
జిల్లాలోని 20 జెడ్పీటీసీ, 340 ఎంపీటీసీ స్థానాలకు గురువారం పోలింగ్ పూర్తయిన విషయం విదితమే. జిల్లాలో 5,20,713 మంది పురుషులు, 5,32,203 మహిళలు, 11 మంది ఇతరులు కలిపి మొత్తం 10,52,927 మంది ఓటర్లకు గాను 69.73 పోలింగ్ శాతంతో 7,34,155 మంది ఓటుహక్కును వినియోగించుకున్నారు. వీరిలో 3,65,443 మంది పురుషులు, 3,68,708 మంది మహిళలు, ఇతరులు నలుగురు ఉన్నారు. పోలింగ్ అనంతరం భీమవరం డివిజన్‌లోని బ్యాలెట్ బాక్సులను ఎస్‌ఆర్‌కేఆర్ కళాశాల, నరసాపురం డివిజన్‌లోని వాటిని వైఎన్ కళాశాలకు, తాడేపల్లిగూడెం డివిజన్‌లోని బాక్సులను ఆదికవి నన్నయ్య యూనివర్సిటీలో ఏర్పాటుచేసిన స్ట్రాంగ్ రూమ్‌లకు తరలించారు.
తేలనున్న భవితవ్యం
భీమవరం, నరసాపురం, తాడేపల్లిగూడెంలో కౌంటింగ్
ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు
మూడు కేంద్రాల్లో 219 టేబుళ్లు
ముందు ఎంపీటీసీ, తర్వాత జెడ్పీటీసీ సభ్యుల ఫలితాలు
తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లతో కౌంటింగ్ ప్రారంభమవుతుంది. తర్వాత బ్యాలెట్ బాక్సుల్లోని ఓట్లను బయటకుతీసి జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులకు పోలైన ఓట్లను ఓట్లను వేరు చేస్తారు. ఒక్కో దశలో ఎంపీటీసీ అభ్యర్థులకు పోలైన ఓట్లు లెక్కించిన అనంతరం జెడ్పీటీసీ అభ్యర్థుల ఓట్లను లెక్కిస్తారు. మధ్యాహ్నం 11 నుంచి 12 గంటల సమయానికి తొలి ఫలితం వెలువడుతుందని భావిస్తున్నారు.


