ముదురుతున్న డబ్బా వేట వివాదం
నరసాపురం: సముద్ర సంగమ ప్రాంతానికి, బంగాళాఖానికి చేరువలో ఉన్న నరసాపురం గోదావరిలో అపార మత్స్యసంపద ఉంది. రోజూ రూ.కోట్ల విలువ చేసే మత్స్య సంపద ఇక్కడ గోదావరిలో లభ్యమవుతోంది. అయితే కొన్ని నెలలుగా గోదావరిలో మత్స్య సంపద కాలుష్యం కారణంగా మృతువాత పడుతోంది. నరసాపురంలోని పొన్నపల్లి నుంచి మండలంలో రాజుల్లంక వరకూ గోదావరి పొడవునా చేపలు చచ్చిపోయి తేలుతున్నాయి. పట్టణ పరిధిలో ఇటు వైపు, మండల పరిధిలో రాజుల్లంక వద్ద రెండు చోట్లా సీఎం చంద్రబాబు బంధువులకు చెందిన రెండు పెద్ద రొయ్యల ప్రాసెస్ యూనిట్లు ఉన్నాయి. ఈ కంపెనీలకు చెందిన విషతుల్యమైన వ్యర్థాలు నేరుగా, కొన్ని సందర్భాల్లో ట్యాంకర్ల ద్వారా తీసుకువచ్చి గోదావరిలో కలుపుతుండటంతో నదీ జలాలు కలుషితమై చేపలు చనిపోతున్నాయని మత్స్యకార సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చర్యలు చేపట్టాలంటూ అధికారులకు ఫిర్యాదులు చేసినా ఫలితం శూన్యం గోదావరిలో గుడ్లు, చేపలు మృత్యువాత పడుతున్నాయని, కొన్ని రకాల చేపల పునరుత్పత్తికి ప్రమాదమని శాస్త్రవేత్తలు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గోదావరి తీరంలో కొట్లాట
సుమారు 40 మంది ఈనెల 4న గోదావరి గట్టున డబ్బా వేట సాగిస్తుండగా పొన్నపల్లి, మాధవాయిపాలెం ప్రాంతాలకు చెందిన మత్స్యకారులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య గలాటా జరిగింది. ఈ సందర్భంలో అక్కడకు టీడీపీ నేత, రాష్ట్ర మత్స్యకార అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ కొల్లు పెద్దిరాజు వచ్చారు. పట్టణ పోలీసులు చేరుకుని లాఠీచార్జ్జీ చేశారు. పెద్దరాజు పోలీసులను పిలిపించి తమను గాయాలయ్యేలా కొట్టించారని మత్స్యకార యువకులు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉండగా ఘర్షణ విషయం తెలిసి పోలీసులు వచ్చారని, తనకేమీ సంబంధం లేదని పెద్దిరాజు అంటున్నారు.
న్యాయం కోసం పోరాడదాం
రొయ్యల కంపెనీల కాలుష్యం, డబ్బా వేటను వెనకేసుకొస్తున్న టీడీపీ మత్స్యకార నేత వ్యవహారంపై పోరాటం చేద్దామని మత్స్యకార నాయకులు నిర్ణయించారు. శుక్రవారం పొన్నపల్లి రామాలయంలో సమావేశం కాగా.. వీరిలో టీడీపీ, జనసేన నాయకులు కూడా ఉన్నారు. జిల్లా అధికారులకు మరో మారు విన్నవిద్దామని, ముఖ్యమంత్రి వద్దకు వెళ్లి న్యాయం అడుగుదామని చెప్పారు. సమస్య పరిష్కారం కాని పక్షంలో రోడ్కెక్కి ఆందోళనలు చేద్దా మని పిలుపునిచ్చారు. మత్స్యకార నేత లు పీతల ప్రసాద్, పొన్నాల నాగబాబు, వనమాల శ్రీను, కోలా కృష్ణ, కొప్పాడి కనకరాజు పాల్గొన్నారు.
గోదావరి నదిలో కాలుష్యంతో చనిపోయిన చేపలు
పొన్నపల్లిలో రామాలయం వద్ద సమావేశమైన మత్స్యకార నాయకులు
గోదావరిలోకి చంద్రబాబు బంధువుల రొయ్యల కంపెనీల వ్యర్థాలు
మృత్యువాత పడుతున్న చేపలు, రొయ్యలు
కొత్తగా అనధికార డబ్బా వేటపై ముదురుతున్న వివాదం
ఆందోళనలకు మత్స్యకార నాయకుల నిర్ణయం
అధికార కూటమి మత్స్యకార నాయకులే తిరుగుబాటు
ఇటీవల గోదావరిలో చైనా తరహా డబ్బా వేట కల్చర్ మొదలవ్వడం చర్చనీయాంశంగా మారింది. వాటర్ క్యాన్ లాంటి ప్లాస్టిక్ డబ్బాలకు రంధ్రాలు పెట్టి, కొత్త తరహా ముల్లులు అమరుస్తారు. ఈ డబ్బాల్లో మైనా పిండి ముద్దలను ఉంచి గాలం మాదిరిగా తాడుకట్టి గోదావరిలో వదులుతారు. ఈ డబ్బాల్లోకి మూడు కిలోల వరకూ బరువు ఉండే చేపలు వచ్చి చిక్కుతాయి. చైనాలో ఈ తరహా వేట ప్రాచుర్యంలో ఉందని చెబుతున్నారు. ఇటీవల గోదావరి గట్టు వెంబడి రోజంతా వందలాది మంది ఈ తరహా వేట సాగిస్తున్నారు. వీరిలో మత్స్యకారులతో పాటు ఇతర సామాజిక వర్గాల వారు కూడా ఉంటున్నారు. వాస్తవానికి గోదావరిలో వేట మత్స్యకార సొసైటీల్లో సభ్యత్వం ఉన్న బోట్లు, వలలు ఉన్న వారు మాత్రమే చేయాలి. ఓ వైపు చేపలు మృత్యువాత.. మరోవైపు డబ్బావేటతో తమ ఉపాధి దెబ్బతింటోందని మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


