‘అప్పు ఎట్లా తీర్చాలో తెలియట్లేదు.. పంట మొత్తం పోయింది, ఇప్పుడు బతుకు ఎట్లా’ అంటూ రైతులు కన్నీరు పెడుతున్నారు. ఆరుగాలం కష్టించి పండించిన పంట భారీ వర్షంతో తుడిచిపెట్టుకుపోయి నష్టాన్ని మిగిల్చింది. వరుస తుపానులు చేతికొచ్చే పంటను అమాంతం ముంచేశాయి. దీంతో పుట్టెడు దుఃఖంలో నీట మునిగిన వరి కంకులను అష్టకష్టాలు పడుతూ గట్లుపైకి చేరుస్తున్నారు కర్షకులు. వరి నేలకొరిగి, నీటిలో మునిగి ముద్దయిపోవడం చూసి తట్టుకోలేక పంటను కాపాడుకునేందుకు నానాపాట్లు పడుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. పాలకోడేరు మండలం మోగల్లులోని గుత్తలవారిపాలెంలో వరి చేలు వద్ద కనిపిస్తున్న దృశ్యాలివి. పంట నష్టంపై ప్రభుత్వం తక్షణమే సర్వే చేయించి, పరిహారం ఇచ్చి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. – పాలకోడేరు


