భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లాలో మున్సిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించామని, అలాగే పంచాయతీ ఎ న్నికల నిర్వహణకు సహకరించాలని కలెక్టర్ సీహెచ్ నాగరాణి కోరారు. శుక్రవారం కలెక్టరేట్‌లో జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మితో కలిసి రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈనెల 13న పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కానుందన్నారు. శనివారం జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపడతామని, ఈ మేరకు ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు. ఫలి తాల విడుదల అనంతరం బాణసంచా కాల్చడం, భారీ విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. జిల్లాలో రెండు తుపాన్లు, భారీ వర్షాలు, వరదల కారణంగా సవాళ్లు ఎదురైనా అధికారులు సమర్థవంతంగా ఎన్నికల విధులు నిర్వహించారన్నారు. అత్తిలి, కాశిపాడు, ఉయ్యూరు, నందమూరిగరువు, దువ్వ, తణుకు తదితర ప్రాంతాల్లో వరద పరిస్థితులు తలెత్తాయన్నారు. డీఆర్వో పి.గ్లోరియా, కేఆర్‌సీ డిప్యూటీ కలెక్టర్ పి.ప్రభాకర్, ఎలక్షన్ సూపరింటెండెంట్ శేఖర్, పార్టీల ప్రతినిధులు పి.రత్నరాజు, కృష్ణమురళి, బీవీవీ సత్యనారాయణమూర్తి, రామరాజు, జైశివ, ఎం.శ్యాంబాబు తదితరులు పాల్గొన్నారు.


