ఊరు.. ఏరు.. ఏకమై..! | - | Sakshi
Sakshi News home page

ఊరు.. ఏరు.. ఏకమై..!

Nov 6 2026 2:32 AM | Updated on Nov 6 2026 2:32 AM

ఊరు.. ఏరు.. ఏకమై..!

తాడేపల్లిగూడెం రూరల్‌ : మొన్న అర్నబ్‌... నిన్న మురసు తుపాను తాడేపల్లిగూడెం మండలంలోని ఊళ్లను, చేలను వరదమయం చేశాయి. అర్నబ్‌ తుపానును మించి మురసు ప్రభావంతో వర్షాలు విస్తృతంగా కురవడంతో డ్రెయిన్లు, చెరువులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. చెరువులు ఉప్పొంగడంతో రహదారులు కొట్టుకుపోయాయి. మండలంలోని కడియద్దలో చెరువు ఉప్పొంగడం, కొమ్ముగూడెం వద్ద ప్రధాన రహదారిపై నీటిని పక్కకు మళ్లించడంతో రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. దీంతో ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాల గుండా రాకపోకలు సాగించగా, ఆటోలు సైతం వెళ్లలేని పరిస్థితి నెలకొంది.

పంటలు నీటిపాలు

ఎర్ర కాలువ ఉధృతికి వీరంపాలెం శైవక్షేత్రం మునిగిపోయింది. ఆలయ పరిసరాలు ఎర్ర కాలువ వరద నీటిలో చిక్కుకున్నాయి. కొబ్బరి, పామాయిల్‌ తోటల్లోకి వర్షపు నీరు చేరింది. అర్నబ్‌ తుపాను ధాటికి నీట మునిగిన వరి చేలు తేరుకోకముందే, మురసు తుపాను ప్రభావంతో మళ్లీ నీట మునిగాయి. కాలువ పరీవాహక ప్రాంతాల్లోని చేలన్నీ రోజుల తరబడి నీటిలోనే నాని చివికిపోతున్నాయి. ఎల్‌–నినో ధాటికి వర్షాలు లేక ఇబ్బందిపడిన రైతాంగం, ఆశలు వదులుకోకుండా సాగు చేపట్టగా... అక్టోబరు, నవంబరు నెలల్లో వచ్చిన రెండు తుపాన్ల ధాటికి చేతికొచ్చిన పంట నీటపాలైందని రైతులు లబోదిబోమంటున్నారు. పలువురు రైతులు మరింత పెట్టుబడి పెట్టలేక, నీటిలోనే పంటను వదిలేసే దుస్థితి నెలకొంది.

గ్రామాల్లోకి చేరిన వరద నీరు

మండలంలోని నందమూరు, జగన్నాథపురం గ్రామాల్లోకి ఎర్ర కాలువ వరద నీరు చేరింది. జగన్నాథపురం – మాధవరం ప్రధాన రహదారిపైకి నీరు రావడంతో రాకపోకలు నిలిచిపోయాయి. నందమూరు అక్విడెక్ట్‌ వద్ద గురువారం సాయంత్రం 5 గంటల సమయానికి 38.5 అడుగుల మేర వరద నీరు చేరింది. దీంతో ఆరుళ్ల, కొత్తూరు, మారంపల్లి, మాధవరం గ్రామాల్లోకి కూడా వరద నీరు చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. అర్నబ్‌ తుపాను సమయంలో నందమూరు అక్విడెక్ట్‌ వద్ద గుర్రపుడెక్కను తొలగించి ఉంటే ప్రస్తుతం ఈ పరిస్థితి ఉండేది కాదని స్థానికులు వాపోతున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఎర్ర కాలువ పరీవాహక గ్రామాలు ముంపు బారిన పడ్డాయని ఆరోపిస్తున్నారు. ముంపు ప్రాంతమైన నందమూరులోని పలువురిని అధికారులు పునరావాస కేంద్రానికి తరలించారు. జగన్నాథపురం – మాధవరం రహదారి పక్కన ఉన్న యానాదులు ప్రత్యామ్నాయ ప్రదేశాల్లో తలదాచుకుంటున్నారు.

మరో తుపాను హెచ్చరిక

అర్నబ్‌, మురసు తుపాన్ల ఉధృతికి తాడేపల్లిగూడెం మండలం అతలాకుతలమైంది. దీనికి తోడు మరో తుపాను హెచ్చరికలతో అటు రైతులు, ఇటు ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఇప్పటికే తాడేపల్లిగూడెం గ్రామీణ మండలం జలదిగ్బంధంలో చిక్కుకోగా, మరో తుపాను వస్తే పరిస్థితి ఏంటని అంతా ఆందోళన వ్యక్తున్నారు.

ఉధృతంగా ప్రవహిస్తున్న డ్రెయిన్లు

పొంగిపొర్లుతున్న చెరువులు

గ్రామాలకు స్తంభించిన రాకపోకలు

వరి చేల్లో వరద నీరు

ఎర్రగంగ ఉగ్రరూపం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement