దెందులూరు: పెదవేగి మండలం రామసింగవరంలో జరుగుతున్న ఎంపీటీసీ ఎన్నికలలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. గ్రామంలో దొంగ ఓట్లు వేస్తున్నారని, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులకు యత్నిస్తున్నారనే సమాచారం అందడంతో దెందులూరు మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి వెంటనే అప్రమత్తమై గ్రామానికి చేరుకున్నారు. ఎలాంటి బెదిరింపులకు, ఒత్తిళ్లకు భయపడకుండా వైఎస్సార్‌సీపీ శ్రేణులకు ఆయన అండగా నిలిచారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అక్కడి పరిస్థితులను స్వయంగా పరిశీలించి, నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీకి చెందిన వివిధ విభాగాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
కొయ్యలగూడెం: వరద తాకిడితో జరిగిన పంట నష్టాన్ని అంచనా వేసేందుకు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎస్‌కే హబీబ్ బాషా గురువారం మండలంలో పర్యటించి పొంగుటూరు, కన్నాయిగూడెం గ్రామాల్లో దెబ్బతిన్న పంటచేలను పరిశీలించారు. ప్రాథమిక అంచనా ప్రకారం వరి 1,069 ఎకరాలు, మినుము 107 ఎకరాలు, పొగాకు 206 ఎకరాలు, వేరుశనగ 40 ఎకరాల చొప్పున పంట నష్టం వాటిల్లినట్లు ఆయన తెలిపారు. నష్టపోయిన ప్రతి రైతూ పరిహారం పొందేలా తగిన చర్యలు తీసుకోవాలని మండల వ్యవసాయ అధికారి కేవీఎన్ పోశారావును ఆదేశించారు. మరోవైపు, గోదాముల్లోని వర్జీనియా పొగాకు బేళ్లు ముంపునకు గురికావడంతో, తడిసిన బేళ్లను సంరక్షించుకోవడానికి రైతులు నానా అగచాట్లు పడుతున్నారు. దిప్పకాయలపాడు సమీపంలోని పొగాకు తోటలు వరద ప్రవాహానికి పూర్తిగా కొట్టుకుపోయాయి.
నూజివీడు: పోలింగ్ స్టేషన్ వద్ద గొడవపడుతున్న ఇద్దరిని విడదీయబోయిన వ్యక్తిపై కత్తితో దాడి చేసిన సంఘటన గురువారం నూజివీడు మండలం తూర్పుదిగవల్లిలో చోటుచేసుకుంది. గ్రామంలోని పోలింగ్ స్టేషన్ ఆవరణలో జనం ఎక్కువగా ఉండటంతో ఇరువర్గాల నాయకులు మధ్యాహ్నం 3 గంటల సమయంలో అందరినీ బయటకు పంపించివేశారు. అయితే, తుమ్మేటి రత్నారావు (42) అక్కడే ఉండటంతో ఇస్సాయేలు అనే వ్యక్తి బయటకు రావేంటి అని ప్రశ్నించడంతో ఇద్దరి మధ్య వాగ్వివాదం చెలరేగింది. వారు రోడ్డుపైకి వచ్చి గొడవపడుతుండగా.. అదే గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ రొంపిచర్ల సీతయ్య (24) వారిని విడదీసేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో రత్నారావు కుమారుడు వరుణ్‌తేజ తన చేతిలోని కీ–చైన్ చాకుతో సీతయ్య మెడ ఎడమ భాగంలో కోయడంతో తీవ్రగాయమైంది. గమనించిన స్థానికులు క్షతగాత్రుడిని వెంటనే నూజివీడు ఏరియా ఆసుపత్రికి తరలించగా, వైద్యులు చికిత్స అందించారు.
భీమవరం: స్థానిక డీఎన్‌ఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీకి చెందిన 80 మంది ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు గురువారం ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ వి.ప్రవీణ్ ఆధ్వర్యంలో వీరవాసరం మండలంలో జరిగిన జెడ్పీటీసి, ఎంపీటీసీ ఎన్నికల విధుల్లో పాల్గొని విశేష సేవలందించారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎన్నికల సిబ్బందికి అవసరమైన సహాయ సహకారాలు అందించడంతో పాటు, వెబ్‌కాస్టింగ్ విధుల్లోనూ వారు చురుకుగా పాల్గొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికల నిర్వహణకు సహకరించడం ద్వారా విద్యార్థులు తమ సామాజిక బాధ్యతను చాటుకున్నారు. ఈ సందర్భంగా కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ గాదిరాజు సత్యనారాయణరాజు (బాబు), వైస్ ప్రెసిడెంట్ గోకరాజు పాండురంగరాజు, ప్రిన్సిపాల్ డాక్టర్ బీవీఎస్ వర్మ.. వాలంటీర్ల సేవలను అభినందించారు.


