పంటల్లో యాజమాన్య చర్యలు తప్పనిసరి | - | Sakshi
Sakshi News home page

పంటల్లో యాజమాన్య చర్యలు తప్పనిసరి

Nov 6 2026 2:32 AM | Updated on Nov 6 2026 2:32 AM

పెనుగొండ: వరుసగా వచ్చిన ఆర్నబ్‌, మురసు తుపాన్ల ప్రభావం వలన గోదావరి జిల్లాలో వివిధ పంటలు ముంపుకు గురైనాయి. తుపాన్ల తాకిడితో దెబ్బతిన్న వివిధ పంటలలో చేపట్టవలసిన యాజమాన్య మెలకువలపై ఆచార్య ఎన్‌. జి. రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఏరువాక కేంద్రం కోఆర్డినేటర్‌ డా. మానుకొండ శ్రీనివాస్‌ పలు సూచనలు చేశారు. ఆయన గోదావరి జిల్లాల్లో నీటి మునిగిన వరిచేలను మార్టేరు వరి పరిశోధన స్థానం ఏడీఆర్‌ డాక్టర్‌ సీహెచ్‌ శ్రీనివాస్‌, వరి ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ ఎం గిరిజారాణి, రాజమండ్రి వ్యవసాయ కళాశాల అసోసియేట్‌ డీన్‌ డాక్టర్‌ కేవీ రమణమూర్తిలతో కలిసి పరిశీలించారు.

వరి రకాల పరిస్థితి

అర్నబ్‌ తుపాను ప్రభావంతో గోదావరి జిల్లాల్లో వేలాది హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా వరి పంటలో స్వర్ణ, సంపద స్వర్ణ రకాలు పాలు పోసుకునే దశ నుంచి గింజ గట్టిపడే దశలో నేలకు ఒరిగి నీట మునిగాయి. సస్యరక్షణ చర్యలు చేపడుతుండగా తరువాత వచ్చిన మురుసు తుపానుతో అప్పటికే పడిపోయిన చేలు మళ్లీ నీట మునిగాయి. దీనితో వర్షాలకు తడిసి పంట పూర్తిగా పాడై కుళ్లిపోయే ప్రమాదం ఏర్పడింది. అలాగే, ప్రస్తుతం ఈనిక దశ, పాలు పోసుకునే దశలో ఉన్న ఎంటీయూ 1318, పీఎల్‌ఏ 1100 తదితర రకాలలో ధాన్యం రంగు మారడం, పొల్లు గింజల శాతం పెరిగే అవకాశం ఉంది. గింజ గట్టిపడిన తడిచిన ధాన్యంలో తేమ శాతాన్ని బట్టి నూక శాతం కూడా పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది.

తీవ్రంగా దెబ్బతిన్న చేలల్లో తీసుకోవాల్సిన చర్యలు

ఎక్కువ రోజులు నీట మునిగిన చేలు..

చేను పడిపోయి వారం రోజులకు పైగా నీట మునిగితే మొక్కలు కుళ్లిపోతాయి. గడ్డి వేగంగా కుళ్లడానికి వేస్ట్‌ డికంపోజర్‌ వాడాలి. రాబోయే దాళ్వా సీజన్‌లో ఎంటీయూ 1121, సన్నగింజ రకం ఎంటీయూ 1282, ఎంటీయూ 1426, ఎగుమతికి అనువైన ఎంటీయూ 1293, ఎంటీయూ 1290 రకాలను సాగు చేసుకోవడం మంచిది.

పాక్షికంగా పడిపోయిన లేదా 3 రోజుల్లోపు నీట మునిగిన పొలాలు

నిలబడి ఉన్న వరి చేన్లలో నిద్రావస్థ లేని బీపీటీ 5204, పీఎల్‌ఏ 1100 వంటి రకాలలో కంకిపైనే మొలక వచ్చే అవకాశం ఉంది. నిరంతర వర్షాల వల్ల గింజలోని నిద్రావస్థ తొలగి, ఎంటీయూ 1318 వంటి నిలబడి ఉన్న, పడిపోయిన చేలల్లో కూడా మొలకలు వచ్చే అవకాశం ఉంది. కోత దశలో నిలిచిన లేదా పడిపోయిన పంట కంకిలో మొలకలు కనిపిస్తే, ముందుగా నీటిని బయటకు తీసివేయాలి. ఆ తర్వాత 5 శాతం ఉప్పు ద్రావణాన్ని (50 గ్రాముల కల్లు ఉప్పు లీటరు నీటికి కలిపి) పిచికారీ చేయాలి. ఇది గింజలు మొలకెత్తడాన్ని, రంగు మారడాన్ని తగ్గిస్తుంది.

ఏరువాక కేంద్రం కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ మానుకొండ సూచనలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement