తమ్మిలేరు ఉగ్రరూపం | - | Sakshi
Sakshi News home page

తమ్మిలేరు ఉగ్రరూపం

Nov 6 2026 2:32 AM | Updated on Nov 6 2026 2:32 AM

చింతలపూడి: స్థానికంగా కురుస్తున్న వర్షాలతో పాటు, ఖమ్మం జిల్లాలో పడుతున్న భారీ వర్షాల కారణంగా తమ్మిలేరు రిజర్వాయర్‌ పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరుకుంది. దీంతో తమ్మిలేరు ఉధృతంగా ప్రవహిస్తోంది. గురువారం అధికారులు ప్రాజెక్టు మూడు గేట్ల ద్వారా 5,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రస్తుతం తమ్మిలేరు ప్రాజెక్టు నీటిమట్టం 350 అడుగులకు, గోనెలవాగు బేసిన్‌ నీటిమట్టం 340 అడుగులకు చేరుకున్నాయి. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బేతుపల్లి అలుగు పైనుంచి నీరు ప్రవహిస్తుండటంతో, గంటకు 10 వేల క్యూసెక్కుల నీరు ఆంధ్రా కాల్వ ద్వారా ప్రాజెక్టులోకి వస్తోందని ఏఈ లాజర్‌బాబు తెలిపారు. ముఖ్యంగా శివపురం, చిన్నంపేట గ్రామాల మధ్య తమ్మిలేరు కాల్వపై నిర్మించిన కాజ్‌వేపై నీరు ప్రవహిస్తుండటంతో రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. ఈ ప్రమాదకర పరిస్థితిని అంచనా వేసిన జిల్లా అధికారులు, కాజ్‌వే వద్ద తగిన భద్రతా చర్యలు చేపట్టారు. ప్రజలు వాగు వద్దకు వెళ్లకుండా రెవెన్యూ సిబ్బందిని ఏర్పాటు చేశారు. ప్రాజెక్టులో 350 అడుగుల వరకు నీటిని నిల్వ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. గోనెలవాగులోకి నీరు నింపడానికి వీలుగా ప్రాజెక్టు గేట్లను సాయంత్రానికి మూసివేశామని, వరద పరిస్థితిని బట్టి మళ్లీ గేట్లు తెరిచి నీటిని దిగువకు విడుదల చేస్తామని వెల్లడించారు.

చాట్రాయి: ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బేతుపల్లి చెరువుకు అకస్మాత్తుగా వచ్చిన వరద నీరు తమ్మిలేరు రిజర్వాయర్‌కు చేరుతోంది. దీంతో చిన్నంపేట వద్ద తమ్మిలేరు వాగు పొంగి ప్రవహించడంతో ఇరువైపులా ఉన్న శివపురం, చిన్నంపేట గ్రామాల్లోకి వరద నీరు చేరింది. సీకే పాడు ఛానల్‌ ద్వారా కోటపాడు, చిన్నంపేట చెరువులకు భారీగా వరద నీరు చేరుతోంది. ఈ రాత్రికల్లా గోనెల వాగు పూర్తి నీటిమట్టానికి చేరుకునే అవకాశం ఉందని టీఆర్‌పీ అధికారులు చెబుతున్నారు. రిజర్వాయర్‌ పూర్తి నీటిమట్టానికి చేరడంతో ఆయకట్టులో రబీ సాగుకు ఎలాంటి ఢోకా ఉండదని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement