జంగారెడ్డిగూడెం (బుట్టాయగూడెం): సొంతూరికి వెళ్లి ఓటు హక్కు వినియోగించుకునేందుకు బయలుదేరిన ఓ మహిళకు ఆర్టీసీ బస్సు ప్రయాణంలో చేదు అనుభవం ఎదురైంది. గుర్తుతెలియని వ్యక్తులు ఆమె బ్యాగులో ఉన్న సుమారు 10 కాసుల బంగారు ఆభరణాలు, రూ.1,500 నగదు చోరీ చేసిన ఘటన జంగారెడ్డిగూడెంలో చోటుచేసుకుంది. బాధితురాలి వివరాల ప్రకారం.. ఏలూరులో నివాసముంటున్న ప్రణామి అనిల తన స్వగ్రామమైన వేగవరంలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు వేసేందుకు బస్సులో బయలుదేరారు. ప్రయాణ భద్రతను దృష్టిలో ఉంచుకుని, తన వద్ద ఉన్న రెండు బంగారు గొలుసులు, రెండు గాజులు, చెవిదిద్దులు, నగదును ఓ పర్సులో పెట్టి హ్యాండ్‌బ్యాగులో భద్రపరుచుకున్నారు. ఏలూరు నుంచి జంగారెడ్డిగూడెం బస్టాండ్‌కు చేరుకున్న అనంతరం, అక్కడి నుంచి తాడేపల్లిగూడెం వెళ్లే మరో బస్సు ఎక్కారు. పాత బస్టాండ్ స్టాప్ వద్ద దిగేందుకు సిద్ధమవుతుండగా, హ్యాండ్‌బ్యాగు జిప్పు తెరిచి ఉండటాన్ని ఆమె గమనించారు. అనుమానం వచ్చి లోపలికి చూసేసరికి, బంగారు ఆభరణాలు, నగదు ఉన్న పర్సు కనిపించకపోవడంతో ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. వెంటనే ఈ విషయాన్ని బస్సు కండక్టర్, డ్రైవర్ల దృష్టికి తీసుకెళ్లగా.. వారు డయల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం అందించారు. పోలీసుల సూచన మేరకు ప్రయాణికులతో ఉన్న ఆ బస్సును నేరుగా జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


