భీమవరం: పట్టణంలోని కాస్మో పాలిటెన్ క్లబ్‌లో నిర్వహిస్తున్న జాతీయస్థాయి టెన్నిస్ పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయని క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు సీహెచ్ రామభద్రిరాజు, బీహెచ్ సుబ్బరాజు, టోర్నమెంట్ చైర్మన్ యు.కృష్ణప్రసాద్, వైస్ చైర్మన్ టి.కృష్ణబాబు తెలిపారు. గురువారం జరిగిన పోటీల్లో సింగిల్స్ విభాగంలో పురుషుల విభాగంలో జయప్రకాష్, పి.శాండిల్య, వి.ధీరజ్‌రెడ్డి, బి.నాశిక్‌రెడ్డి, ఐ ప్రసాద్, మయాంద్ తివారి, పి.ధర్మలింగం విజేతలుగా నిలిచారు. మహిళా విభాగంలో డి.లక్ష్మిసిరి, ఎం.పార్థసారథి అరుణ్, కె.లలితా విజయభాస్కర్‌రెడ్డి, నిర్మల్ ఫెర్నాండో, హర్షిణి నాగరాజ్, లక్ష్మి గౌడ విజయం సాధించారు. డబుల్స్ పురుషుల విభాగంలో అమిత్ మూంద్– వాన్ష్ నందాల్, అచ్యుత్ మంతెన– నీరజ్ దంతులూరి, బద్రినారాయణన్– శ్రీకర్, మహిళా విభాగంలో నైనికా నరేందర్‌రెడ్డి– ఐ పూజా జోడి గెలుపొందింది.
యలమంచిలి: మండలంలోని ఆర్యపేట గ్రామానికి చెందిన ఈదా దావీదు (52) గురువారం ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రానికి వెళుతూ మార్గమధ్యలో గుండెపోటుకు గురయ్యాడు. వెంటనే ఆయన్ను స్థానికులు పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. మృతుడు అవివాహితుడు.


