కొందరి స్వార్థంతోనే..
రోడ్డంతా అధ్వానం
భీమవరం అర్బన్: మండలంలోని కోమటితిప్ప నార్త్ పంచాయతీ పరిధిలోని వెంకటతిప్ప గ్రామంలో ఓటర్లు ఎన్నికలు బహిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు)కు నిరసన సెగ ఎదురైంది. కోమటితిప్ప నార్త్ పంచాయతీలో సుమారు 367 మంది, కోమటితిప్ప నార్త్‌లో సుమారు 150 మంది వరకు ఓటర్లు ఉన్నారు. అయితే ఎన్నికల అధికారులు ఎక్కువ ఓటర్లు కలిగిన వెంకటతిప్పలో పోలింగ్ స్టేషన్ నం.52 ఏర్పాటు చేయాల్సి ఉండగా రెండు కిలోమీటర్లు దూరంలోని కోమటితిప్ప నార్త్‌లో ఏర్పాటు చేయడంతో వెంకటతిప్ప గ్రామస్తులు ఎన్నికలను బహిష్కరించారు. పలువురు గ్రామస్తులు మాట్లాడుతూ 40 ఏళ్లుగా వెంకటతిప్పలో పోలింగ్ స్టేషన్ ఏర్పాటుచేసేవారని, ఇప్పుడు కొందరు స్వార్థం కోసం దూరంగా ఉన్న కోమటితిప్ప నార్త్‌లో పోలింగ్ స్టేషన్‌ను ఏర్పాటుచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంకటతిప్ప నుంచి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో రోడ్డు రాళ్లు మొనతాలాయని, వృద్ధులు, దివ్యాంగులు ఎలా వెళ్తారని ప్రశ్నించారు. సాయంత్రం 5 గంటలైనప్పటికీ వెంకటతిప్ప గ్రామస్తులు పోలింగ్‌లో పాల్గొనకపోవడం చర్చనీయాంశంగా మారింది.
ఎమెల్యేకు నిరసన సెగ
ఎమ్మెల్యే అంజిబాబు గ్రామస్తులను సముదాయించేందుకు ఇక్కడకు రాగా వారి నుంచి నిరసన సెగ ఎదురైంది. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ పోలింగ్ బూత్ ఏర్పాటుచేస్తామని చెప్పినా గ్రామస్తులు ఒప్పుకోలేదు. దీంతో ఆయన వెనుదిరిగి వెళ్లిపోయారు.
ఎమ్మెల్యే అంజిబాబుకు నిరసన సెగ
40 ఏళ్ల క్రితం గునుపూడి సౌత్ డ్రైన్ ఆవలి వైపు ఉన్న శ్రీరామపురం వెళ్లి ఓట్లు వేసేవాళ్లం. అప్పట్లో గ్రామస్తులంతా కష్టపడి మా గ్రామానికి పోలింగ్ బూత్ తెచ్చుకున్నాం. ఇప్పుడు కొంతమంది స్వార్థం కోసం రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న కోమటితిప్పలో పోలింగ్ బూత్ పెడితే ఎలా.. వృద్ధులు, దివ్యాంగులు ఎలా వెళ్లి ఓటేస్తారు. ప్రజాప్రతినిధులు, ఎన్నికల అధికారులకు ఈ విషయం తెలియదా?
– నాగిడి ధర్మరాజు, మాజీ సర్పంచ్, కోమటితిప్ప నార్త్
వెంకటతిప్ప నుంచి కోమటితిప్ప నార్త్ సెంటర్ వరకు రెండు కిలోమీటర్ల మేర ఆర్‌అండ్‌బీ రోడ్డుపై రాళ్లు మొనతేలాయి. అలాగే భారీ వర్షాలతో రోడ్డు మునిగిపోయింది. ఎక్కువ ఓటర్లు ఉన్న చోట పోలింగ్ బూత్ ఏర్పాటుచేయాలి కాని ఓటర్లు లేని చోట పోలింగ్ బూత్ ఏర్పాటు చేయడమేంటి. చాలా మంది ఓటేసేందుకు రాలేదు. సమస్య పరిష్కరించేంత వరకు ఎన్నికలు బహిష్కరిస్తూనే ఉంటాం.
– బొమ్మిడి బాబు రాజేంద్రప్రసాద్, మాజీ ఎంపీటీసీ, దెయ్యాలతిప్ప


