భీమవరం (ప్రకాశం చౌక్): అర్నబ్ తుపాను తీవ్ర ప్రభావంతో జిల్లాలో దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థను పునరుద్ధరించేందుకు యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టామని ఏపీఎస్‌పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్ లోతేటి తెలిపారు. గురువారం స్థానిక జిల్లాపరిషత్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. జిల్లాలో 98 సబ్‌స్టేషన్ల పరిధిలో పునరుద్ధరణ పనులు పూర్తయ్యాయన్నారు. ప్రభావితమైన 67 విద్యుత్ లైన్ల (33 కేవీ)లో 65 లైన్లను 475 (11 కేవీ) విద్యుత్ లైన్లలో 472 లైన్లను పునరుద్ధరించామన్నారు. మిగిలిన లైన్ల పనులు చివరి దశలో ఉన్నాయని పేర్కొన్నారు. 20 మండలాల్లోని 409 గ్రామాల్లో గృహ విద్యుత్ సరఫ రాను నూరు శాతం, 17,584 ప్రభావిత ఆక్వా విద్యుత్ సర్వీసులకు 14,595 సర్వీసులకు విద్యుత్ సరఫరా పునరుద్ధరించామన్నారు. జిల్లావ్యాప్తంగా 226 బృందాలకు చెందిన 3,254 మంది అధికారులు, సిబ్బంది పనుల్లో పాల్గొన్నారన్నారు. తుపాను కారణంగా విద్యుత్ రంగానికి ప్రాథమిక అంచనా ప్రకారం రూ.50.49 కోట్ల మేర నష్టం వాటిల్లిందన్నారు. ప్రజలు విద్యుత్ సమస్యల పరిష్కారానికి కాల్ సెంటర్లను ఏర్పాటుచేశామన్నారు. జిల్లా కాల్ సెంటర్–9490610152, భీమవరం డివిజన్–94931 77646, నరసాపురం డివిజన్–7382050943, తాడేపల్లిగూడెం డివిజన్– 9493177806 నంబర్లలో సంప్రదించాలన్నారు. కలెక్టర్ నాగరాణి, జేసీ కేఆర్ కల్పశ్రీ, విద్యుత్ శాఖ డైరెక్టర్ సూర్య ప్రకాష్, ఎస్‌ఈ పి.ఉషారాణి తదితరులు పాల్గొన్నారు.


