భీమవరం : అర్నబ్ తుపాను కారణంగా దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థ వారం రోజులు గడిచినా పూర్తిస్థాయిలో గాడిన పడలేదు. 24 గంటల్లో విద్యుత్ పునరుద్ధరిస్తామంటూ విద్యుత్‌శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ గొప్పగా ప్రకటించినా, ఆచరణలో అది శూన్యమని ప్రజలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. జిల్లాలోని 409 గ్రామాల్లో తుపాను ధాటికి భీకర గాలులు వీయడంతోపాటు చెట్లు కూలి, వేలాది విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. గత నెల 27వ తేదీ రాత్రి తుపాను సంభవించినా, నేటికీ అనేక గ్రామాల్లో విద్యుత్ సరఫరా పునరుద్ధరించకపోవడంతో తాగునీటికి సైతం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
అధికారుల తీరుపై విమర్శలు
విద్యుత్ సరఫరా పునరుద్ధరణ కోసం జిల్లావ్యాప్తంగా సుమారు 1,550 మంది సిబ్బంది 125 బృందాలుగా ఏర్పడి.. నేలకూలిన స్తంభాల స్థానంలో కొత్తవాటిని నిలబెట్టి, తెగిపడిన తీగలను సరిచేసే పనిలో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే, వీరిలో ఎక్కువమంది పనిచేయడం కంటే ఫొటోలు, వీడియోలు తీయించుకోవడానికే పరిమితమవుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కష్టపడి పనిచేసే విద్యుత్ సిబ్బంది కంటే, వారికి సూచనలు, సలహాలు ఇచ్చే అధికారులే ఎక్కువగా ఉన్నారని ఆయా గ్రామాల ప్రజలు వాపోతున్నారు. ఆదివారం నాటికి కేవలం 209 గ్రామాలకు మాత్రమే విద్యుత్ సరఫరా పూర్తిచేసినట్లు ఉన్నతాధికారులు ప్రకటించడం.. పునరుద్ధరణ పనుల అస్తవ్యస్త తీరును చెప్పకనే చెబుతోంది.
టోల్‌ఫ్రీ నంబర్లు పనిచేయలేదు
జిల్లాలోని పలుకుబడి గల ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు తమ ప్రాంతాల్లో వెంటనే విద్యుత్ సరఫరా పునరుద్ధరింపజేసుకోగలిగారని, పట్టించుకోని ప్రాంతాల్లో మాత్రం సోమవారం మధ్యాహ్నం వరకు విద్యుత్ లేకుండా పోయిందని విమర్శిస్తున్నారు. సమస్యల పరిష్కారానికి టోల్‌ఫ్రీ నంబర్లు, కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసినట్లు ప్రచారం చేసినా, ఫోన్‌లు లిఫ్ట్ చేయకపోవడంతో తమ గోడు ఎవరికి చెప్పుకోవాలో తెలియక అవస్థలు పడుతున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నీటి ఎద్దడి, దోమల బెడద
విద్యుత్ సరఫరా లేకపోవడంతో మంచినీటికి ప్రజలు పడుతున్న కష్టాలు వర్ణనాతీతం. గ్రామ పంచాయతీలు జనరేటర్లు, ఆయిల్ ఇంజిన్ల సహాయంతో తాగునీటిని సరఫరా చేస్తున్నప్పటికీ అది అరకొరగానే ఉంటోంది. ముఖ్యంగా గ్రామాల్లోని శివారు ప్రాంతాలకు నీటి సరఫరా సక్రమంగా అందడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాగునీటి సమస్యతోపాటు దోమల బెడద విపరీతంగా పెరిగిందని, ఫ్యాన్‌లు లేక వృద్ధులు, చిన్నపిల్లలు అల్లాడిపోతున్నారని వాపోతున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం తక్షణమే స్పందించి, పూర్తిస్థాయిలో విద్యుత్ పునరుద్ధరణపై దృష్టి పెట్టాలని ప్రజలు కోరుతున్నారు.
అర్నబ్ తుపానుతో వారం రోజలుగా అంధకారంలో గ్రామాలు
పునరుద్ధరణ పనుల జాప్యంపై తీవ్ర విమర్శలు
పనిచేయని కంట్రోల్ రూమ్ ఫోన్లు
తాగునీరు, దోమల సమస్యతో ప్రజల ఇబ్బందులు


