నరసాపురం: అర్నబ్ తుపాను నరసాపురం పట్టణంలో తీవ్ర నష్టాన్ని మిగిల్చి ఆరు రోజులు అవుతున్నా, ఇప్పటివరకు పూర్తిస్థాయిలో విద్యుత్ సరఫరా పునరుద్ధరించలేకపోయారని వైఎస్సార్‌సీపీ జిల్లా అధికార ప్రతినిధి ఏడిద కోటసత్యనారాయణ (వైకేఎస్) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పట్టణంలో చాలా ప్రాంతాలు నేటికీ అంధకారంలోనే ఉన్నాయని, కరెంట్ లేక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని వైకేఎస్ పేర్కొన్నారు. ఇన్ని రోజులు గడిచినా విద్యుత్ సరఫరా పునరుద్ధరించలేకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. మరోవైపు పట్టణంలో పారిశుద్ధ్యం పూర్తిగా క్షీణించిందని, రోడ్లపై చెత్తకుప్పలు పేరుకుపోయాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రక్షిత మంచినీటి సరఫరా నిలిచిపోగా, కుళాయిల నుంచి ఏకంగా మురుగునీరు వస్తోందని మండిపడ్డారు. గతంలోనూ పట్టణం అనేకసార్లు తుపానుల తాకిడికి గురైందని, అయితే నాటి అధికార యంత్రాంగం ఎప్పుడూ ఇలా నిద్రావస్థలో ఉన్న దాఖలాలు లేవని స్పష్టం చేశారు.


