● ఓ వర్గం నేతలకు ఎమ్మెల్యే మద్దిపాటి వార్నింగ్
● పార్టీలో విభేదాలు మరోసారి బట్టబయలు
ద్వారకాతిరుమల: ఎన్నికల వేళ ప్రత్యర్థి పార్టీలపై విమర్శలు చేయాల్సిన ఎమ్మెల్యే.. సొంత పార్టీలోని ప్రత్యర్థి వర్గం నేతలను తోడేళ్లు, గుంటనక్కలతో పోలుస్తూ హెచ్చరికలు చేశారు. ‘వెన్నుపోటు పొడవొద్దు.. దొంగదెబ్బలు.. చీకటి దెబ్బలు తీయొద్దు’ అంటూ హుకుం జారీ చేశారు. అలాగే పరోక్ష హెచ్చరికలు కూడా చేశారు. గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు ఆదివారం రాత్రి తిమ్మాపురంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో చేసిన ఈ వ్యాఖ్యలు టీడీపీలోని అంతర్గత విభేదాలను మరోసారి బహిర్గతం చేశాయి. తిమ్మాపురంలో కొన్ని తోడేళ్లు ఉన్నాయంటూ ఎమ్మెల్యే వ్యాఖ్యానించడం గమనార్హం. చిన్నపాటి భేదాలు ఉన్నంత మాత్రాన ఎవరూ వెన్నుపోటు పొడవొద్దని అన్నారు. ‘పరిపాలించడం వచ్చు.. ప్రేమించడం వచ్చు.. అవసరమైతే రెండోది కూడా వచ్చు’ అంటూ చేసిన హెచ్చరిక వ్యాఖ్యలు సభలో చర్చకు దారితీశాయి. ఎంపీపీ అభ్యర్థిని తిమ్మాపురం గ్రామానికి చెందిన మహిళ కావడంతో.. ‘నిజానికి ఈపాటికే మీరు మీ ఊరును క్లీన్ స్వీప్ చేసేసి ఉండాల్సింది’ అంటూ ఎమ్మెల్యే వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది.
రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు
ఓ వర్గం నేతలను బహిరంగంగా తోడేళ్లు, గుంటనక్కలతో పోలుస్తూ చేసిన వ్యాఖ్యలు టీడీపీలోని విభేదాలను మరింత బహిర్గతం చేశాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై కొందరు నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల ప్రచార వేదికగా ఎమ్మెల్యే చేసిన ఈ హెచ్చరికలు టీడీపీ శ్రేణుల్లో హాట్‌టాపిక్‌గా మారాయి. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీ కోసం నిబద్ధతతో కష్టపడి పనిచేసినా తమకు తగిన గుర్తింపు, ఫలితం ఉండదని ప్రత్యర్థి వర్గం నేతల్లో చర్చ జరుగుతున్నట్లు సమాచారం.


