పెంటపాడు: రాచర్ల గ్రామంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఆయన వలంటీర్‌గా విస్తృత సేవలు అందించారు. జగనన్న ప్రవేశపెట్టిన ప్రతి పథకాన్ని 50 కుటుంబాలకు చేరవేశారు. ప్రతి నెలా పొద్దుపొడవక ముందే వృద్ధులు, వికలాంగులకు పింఛన్ సొమ్మును ఠంచన్‌గా, సక్రమంగా అందించి అవ్వాతాతల మనసులు గెలుచుకున్నారు. ఆ స్పూర్తితోనే నేడు గ్రామానికి మరింత సేవ చేయాలనే సంకల్పంతో ఎంపీటీసీ అభ్యర్థి చీర శివరామకృష్ణ బరిలో నిలిచారు. తాను గతంలో ప్రజలకు అందించిన సేవలే తనను గెలిపిస్తాయనే పూర్తి నమ్మకంతో ఆయన గ్రామంలో ముమ్మరంగా ఓట్లు అభ్యర్ధిస్తున్నారు.
తణుకు అర్బన్: హత్యానేరానికి సంబంధించి తణుకు మండలం కొమరవరం గ్రామానికి చెందిన పాల శిరీషను అరెస్టు చేసినట్లు రూరల్ ఎస్సై నాళం శ్రీనివాసరావు తెలిపారు. వివాహేతర సంబంధం నేపథ్యంలో గత నెల 30వ తేదీ రాత్రి ఎదురింట్లో నివసిస్తున్న పాల నాగరాజు (44)పై శిరీష చాకుతో చేతి మణికట్టుపై దాడి చేయడంతో పాటు, రాయితో తలపై, నుదుటి భాగంలో తీవ్రంగా కొట్టింది. దీంతో నాగరాజు ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గత నెల 31న మృతి చెందారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో బాధితుడు నాగరాజు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా పోలీసలు హత్యానేరం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ నెల 1వ తేదీన నిందితురాలిని అరెస్టు చేసి, జ్యుడీషియల్ కస్టడీ నిమిత్తం కోర్టులో హాజరుపరచగా.. న్యాయమూర్తి ఈ నెల 16వ తేదీ వరకు రిమాండ్ విధించినట్లు ఎస్సై వివరించారు. ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మీ పర్యవేక్షణలో డీఎస్పీ బి.నరసింహారావు, తణుకు రూరల్ సీఐ దేశంశెట్టి వెంకటేశ్వరరావు ఈ కేసును దర్యాప్తు చేసినట్లు ఆయన తెలిపారు.


