ఏలూరు (ఆర్‌ఆర్‌పేట), ఏలూరు టౌన్: బియ్యం సంచులపై ముద్రించిన గరిష్ట చిల్లర ధరను అక్రమంగా మార్చడం, చెరిపివేసి కొత్త ధరలను ముద్రించడం, అలాగే తయారీదారు లేదా ప్యాకర్ చిరునామా వివరాలు ముద్రించకపోవడం వంటి నిబంధనలు పాటించని నగరంలోని మూడు బియ్యం దుకాణాలపై అధికారులు 6 కేసులు నమోదు చేశారు. సోమవారం ఏలూరు రీజినల్ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారి కె. నాగేశ్వరరావు ఆధ్వర్యంలో తూనికలు–కొలతల శాఖ, పౌర సరఫరాల శాఖ అధికారులు నగరంలోని పలు బియ్యం దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. నిబంధనలను అతిక్రమించి బియ్యం విక్రయిస్తున్న సాంబశివ రైస్ డిపోపై 3 కేసులు, చంద్రశేఖర రైస్ మర్చంట్స్‌పై 2 కేసులు, శ్రీనివాస రైస్ ట్రేడర్స్‌పై 1 కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. రీజినల్ విజిలెన్స్ అధికారి నాగేశ్వరరావు మాట్లాడుతూ.. నిత్యావసర సరుకులైన బియ్యం, పప్పులు, ఇతర వస్తువులను అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తనిఖీల్లో విజిలెన్స్ డీఎస్పీ సింగులూరి వెంకటేశ్వరరావు, ఏఓ జి.మీరయ్య, తూనికలు–కొలతల శాఖ అధికారి సీహెచ్ వాసుదేవరావు, పౌర సరఫరాల శాఖ ఏఎస్‌ఓ వై.ప్రతాప్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


