అర్నబ్‌ విధ్వంసం | - | Sakshi
Sakshi News home page

అర్నబ్‌ విధ్వంసం

Oct 29 2026 1:36 AM | Updated on Oct 29 2026 1:36 AM

ఆక్వాకు ఆక్సిజన్‌ గండం

చివరిలో నేలకొరిగి..

అర్నబ్‌ తుపాను జిల్లాపై విరుచుకు పడింది. తీరానికి చేరువయ్యే కొద్దీ బలమైన ఈదురుగాలులు, ఎడతెరపిలేని వర్షాలతో జిల్లావాసులను వణికించింది. గాలుల తీవ్రతకు చెట్లు, విద్యుత్‌ స్తంభాలతో పాటు పలుచోట్ల భారీ వృక్షాలు సైతం నేలకొరిగాయి. విద్యుత్‌ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

● జిల్లావ్యాప్తంగా ఈదురుగాలులతో కూడిన వర్షాలు

● నేలకొరిగిన చెట్లు, విద్యుత్‌ స్తంభాలు

● 1.72 లక్షల ఎకరాల్లో నేలనంటిన వరి పంట

● నరసాపురం తీరం.. అతలాకుతలం

సాక్షి, భీమవరం: అర్నబ్‌ మంగళవారం తీవ్ర తుపానుగా బలపడిన తర్వాత నుంచి విశ్వరూపం చూ పించింది. సముద్రం అల్లకల్లోలంగా మారింది. తీరం వెంబడి అలలు ఎగసిపడుతూ నరసాపురం రూరల్‌ చినమైనివాలంక నుంచి పెద మైనివానిలంక వరకు సుమారు నాలుగు కిలోమీటర్ల పొడవునా సముద్రం అరకిలో మీటరు మేర ముందుకు చొచ్చుకువచ్చింది. ప్రధానంగా మంగళవారం రాత్రి తీరం దాటే సమయంలో నరసాపురం, భీమవరం, పాలకొల్లు అతలాకుతలం అయ్యాయి. విద్యుత్‌ అంతరాయంతో కటిక చీకటితో కాలరాత్రిని తలపించింది. ఈదురుగాలులు, భారీ శబ్దాలకు జనం ఇళ్లలో బిక్కుబిక్కుమంటూ గడిపారు. ఇన్వెర్టర్లు, సెల్‌ఫోన్‌లలో చార్జింగ్‌ అయిపోయి కమ్యూనికేషన్‌, రాకపోకలకు వీలు లేక ప్రజా రవాణా వ్యవస్థలు దాదాపు స్తంభించాయి.

నేలకొరిగిన విద్యుత్‌ స్తంభాలు, చెట్లు

గాలుల తీవ్రతకు నరసాపురం రూరల్‌ రాజుల్లంక, ఎల్బీచర్ల, లక్ష్మణేశ్వరం, సీతారాంపురం, తూర్పు తాళ్లు, భీమవరంలోని మెంటేవారితోట, నరసయ్య అగ్రహారం, గునుపూడి, వీరవాసరం మండలంలో మత్స్యపురి, రాయకుదురు, నవుడూరు, యలమంచిలి మండలం మేడపాడు, పెనుమంట్ర మండలం పాలమూరు, ఆలమూరు, వెలగలేరు, బ్రాహ్మణచెరువు, పెనుగొండ, తణుకు, పెంటపాడు తదితర చోట్ల దాదాపు 5 వేల వరకు చెట్లు నెలకొరిగాయి. నరసాపురం–భీమవరం, పాలకొల్లు–నరసాపురం, అత్తిలి–పెనుగొండ తదితర రోడ్లలో దారి వెంబడి చెట్లు పడిపోవడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడి ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. మెయిన్‌ రోడ్లు వెంబడి హోర్డింగులు, ఫ్లెక్సీలు, బోర్డులు ఎగిరిపడ్డాయి.

3,183 విద్యుత్‌ స్తంభాలు నేలవాలి..

జిల్లావ్యాప్తంగా 3,183 విద్యుత్‌ స్తంభాలు, 106 ట్రాన్స్‌ఫార్మర్లు నేలకూలాయి. నరసాపురం ప్రాంతంలో నష్టం తీవ్రత ఎక్కువగా ఉన్నట్టు విద్యుత్‌ అధికారులు తెలిపారు. మంగళవారం సాయంత్రం నుంచి విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. గాలుల తీవ్రతకు బుధవారం రాత్రికి పునరుద్ధరించే వీలులేక ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.

తెరిపివ్వని వర్షం

జిల్లావ్యాప్తంగా తుపాను ప్రభావంతో మంగళవారం సాయంత్రం మొదలైన వర్షం బుధవారం రాత్రి వరకు తెరిపివ్వకుండా కురిసింది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఉప్పుటేరు, యనమదుర్రు ఎర్రకాలువ, చినకాపవరం, గునిపూడి సౌత్‌, బక్లెస్‌, కాజ తదితర డ్రెయిన్లు, పంట కాలువలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పల్లపు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పలు ప్రాంతాల్లో రోడ్లు నీటమునిగాయి.

మరోపక్క చలిగాలుల ప్రభావంతో ఆక్వా చెరువుల్లో ఆక్సిజన్‌ స్థాయిలు తగ్గిపోతుండటం ఆక్వా రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. చేపలు, రొయ్యల చెరువుల్లో సాధారణ పీపీఎం లెవల్స్‌ ఐదు నుంచి ఆరు కాగా ప్రస్తుత వాతావరణంతో 3.4కు పడిపోతుండటంతో ఆక్సిజన్‌ లెవల్స్‌ పెంచుకునేందుకు ఉరుకులు పరుగులు పెడుతున్నారు.

భారీవర్షాలు, ఈదురుగాలులకు జిల్లాలోని 303 గ్రామాల పరిధిలోని 1,02,939 మంది రైతులకు చెందిన 1.72 లక్షల ఎకరాల్లోని వరి పంట నెలకొరిగినట్టు వ్యవసాయశాఖ ప్రాథమిక అంచనా వేసింది. జిల్లా వ్యవసాయ అధికారిణి జి.సునీత సిబ్బందితో కలిసి పలు మండలాల్లో పర్యటించి పంట నష్టం పరిశీలించారు. వర్షం తగ్గాక పూర్తిస్థాయిలో నష్టం అంచనా వేయనున్నట్టు వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. జిల్లాలో 2.08 లక్షల ఎకరాల్లో ఖరీఫ్‌ సాగు చేయగా ప్రస్తుతం పంట కీలకమైన గింజ గట్టిపడే దశలో ఉంది. తాడేపల్లిగూడెం రూరల్‌ పరిధిలో వరి కోతలు జరుగుతుండగా మరో పది రోజుల్లో జిల్లా అంతటా మొదలుకానున్నాయి. విత్తనాలు, నారుమడి తయారీ, పంట దమ్ము, నాట్లు, ఎరువులు, పురుగు మందులు, కూలి ఖర్చులు తదితర రూపాల్లో ఇప్పటికే ఎకరాకు రూ.22 వేల నుంచి రూ.25 వేల వరకు రైతులు పెట్టుబడి పెట్టారు. మరో పది రోజుల్లో పంట కోత కొచ్చి తమ కష్టం గట్టెక్కుతుందన్న తరుణంలో రైతు ఆశలపై తుపాను నీళ్లు చల్లింది. గాలులు, వర్షాలకు వెన్ను బరువెక్కి పంట నేలకొరగడం, ముంపునకు గురికావడం వలన గింజ తాలుగా మారిపోయి దిగుబడులు దెబ్బతింటాయని రైతులు వాపోతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement