భీమవరం: భీమవరం రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి బ్యాలెట్ బాక్సులను భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్‌లు, ఓట్ల లెక్కింపు కేంద్రాలను సాధారణ ఎన్నికల పరిశీలకులు బి.నవ్య మంగళవారం పరిశీలించారు. ఎన్నికల వ్యయ పరిశీలకుడు అహ్మద్ అబ్దుల్ రౌఫ్ షేక్, జాయింట్ కలెక్టర్ కేఆర్ కల్పశ్రీలతో కలిసి భీమవరంలోని ఎస్‌ఆర్‌కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన కేంద్రాలను ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భీమవరం, వీరవాసరం, ఉండి, ఆకివీడు, కాళ్ల, పాలకోడేరు, గణపవరం మండలాల పోలింగ్ సామాగ్రి, బ్యాలెట్ బాక్సుల రక్షణకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. కౌంటింగ్ ప్రక్రియ పారదర్శకంగా, సజావుగా సాగేందుకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను సిద్ధం చేయాలన్నారు. స్ట్రాంగ్ రూమ్‌ల భద్రత విషయంలో ఎలాంటి లోపాలు లేకుండా శాఖల మధ్య సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ తనిఖీల్లో తహసీల్దార్ రాంబాబు, ఎంపీడీవో, పంచాయతీరాజ్ డీఈ తదితరులు పాల్గొన్నారు.
భీమవరం: స్థానిక కాస్మోపాలిటన్ క్లబ్ ఆధ్వర్యంలో ఆల్ ఇండియా టెన్నిస్ అసోసియేషన్, ఆంధ్రప్రదేశ్ లాన్ టెన్నిస్ అసోసియేషన్ సౌజన్యంతో పురుషులు, మహిళల జాతీయ స్థాయి టెన్నిస్ పోటీలు నిర్వహిస్తున్నట్లు టోర్నమెంట్ కమిటీ ప్రతినిధులు వెల్లడించారు. మంగళవారం క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిర్వాహకులు పోటీల బ్రోచర్‌ను ఆవిష్కరించారు. ఈ నెల 31, నవంబర్ 1 తేదీల్లో క్వాలిఫైయింగ్ మ్యాచ్‌లు, నవంబర్ 2 నుంచి 5 రోజుల పాటు మెయిన్ డ్రా పోటీలు జరుగుతాయని తెలిపారు. విజేతలకు రూ. 5 లక్షల నగదు బహుమతి అందించనున్నారు. దేశవ్యాప్తంగా 250 మంది క్రీడాకారులు హాజరవుతున్నారని, వారికి ఉచిత భోజన, వసతి సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. పోటీలు కాస్మోక్లబ్, యూత్ క్లబ్, టౌన్ హాళ్లలో జరుగుతాయని, సిఫా గ్రూప్ చైర్మన్ రాజు వేగేశ్న ప్రధాన స్పాన్సర్‌గా వ్యవహరిస్తుండగా, ఆనంద్ గ్రూప్, అవంతి ఫీడ్స్ సహకారం అందిస్తున్నారని వివరించారు. సమావేశంలో కమిటీ చైర్మన్ ఎ. కృష్ణప్రసాద్, వైస్ చైర్మన్ టి. కృష్ణబాబు పాల్గొన్నారు.
భీమవరం: స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార బలంతో ప్రజాస్వామ్యాన్ని అణచివేయడం సాధ్యం కాదని వైఎస్సార్‌సీపీ ఖతర్ కన్వీనర్ జాఫర్ హుస్సేన్ అన్నారు. ఖతార్‌లో మంగళవారం నిర్వహించిన వైఎస్సార్‌సీపీ ఎన్‌ఆర్‌ఐ వింగ్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు ఖతార్ ఎన్‌ఆర్‌ఐ విభాగం సంపూర్ణ మద్దతు ఇస్తుందని తెలిపారు. అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం, బెదిరింపులు, దాడులకు పాల్పడటం ప్రజాస్వామ్యానికే తీరని మచ్చ అని మండిపడ్డారు. హామీలను నెరవేర్చకపోవడంతో ప్రజల్లో వచ్చిన వ్యతిరేకతను చూసి ఓడిపోతామనే భయంతోనే కూటమి నేతలు దౌర్జన్యాలకు దిగుతున్నారని ఆరోపించారు. ఎన్‌ఆర్‌ఐ వింగ్ నాయకులు నల్లి నాగేశ్వరరావు, సురేష్ వాసర్ల, సీకోలు బాబు, సూర్య రాపాక, షేక్ అఫ్రిది, హరినాథ్ రెడ్డి, కుడిపూడి మురళీ పాల్గొన్నారు.
ఇరగవరం: మండలంలోని రేలంగి ఎంపీటీసీ–3 వైఎస్సార్‌సీపీ అభ్యర్థి బొక్క లక్ష్మి భర్త సత్యనారాయణను మంగళవారం ఉదయం పోలీసులు అదుపులోకి తీసుకోవడం కలకలం రేపింది. ఆయనను బైండోవర్ చేస్తున్నట్లు ప్రచారం జరగడంతో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఆందోళన చేపట్టారు. సత్యనారాయణను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలపడంతో పోలీసులు ఆయనను విడిచిపెట్టారు. అయితే ఆయనను అదుపులోకి తీసుకోవడానికి గల కారణాలను పోలీసులు వెల్లడించాల్సి ఉంది.


