వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి
నరసాపురం: కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాలకు ప్రజలు ఓటుతోనే బుద్ధి చెప్పాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు పిలుపునిచ్చారు. నరసాపురం మున్సిపల్ పీఠాన్ని వైఎస్సార్సీపీకి అందించాలని కోరారు. మంగళవారం పట్టణంలోని 10వ వార్డులో వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ఆయన విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి అధికారంలోకి వచ్చిన ఈ రెండన్నరేళ్లలో పట్టణంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, వైఎస్సార్సీపీతోనే మున్సిపాలిటీ అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. చైర్పర్సన్ అభ్యర్థి కావలి రామసీతతో పాటు అన్ని వార్డుల కౌన్సిలర్ అభ్యర్థులను ఫ్యాన్ గుర్తుపై ఓటేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ చైర్పర్సన్ బర్రి శ్రీవెంకటరమణ, కౌన్సిలర్ అభ్యర్థి బర్రి భవానీ, నాయకులు చినిమిల్లి చందు, బర్రి జయరాజు తదితరులు పాల్గొన్నారు.


