ఎన్నికల హామీలు.. ప్రస్తుత పరిస్థితులు
విద్యుత్ బిల్లులు చెల్లించలేక..
అంతా ప్రచార ఆర్భాటం
విద్యుత్ సబ్సిడీ
ఎప్పుడిస్తారు..?
భీమవరం: ఆక్వా రైతులందరికీ విద్యుత్ సబ్సిడీ ఇస్తామంటూ గత నెలలో కూటమి ప్రభుత్వం చేసిన ప్రకటనలు ఆచరణకు నోచుకోవడం లేదు. భారీ సభలు నిర్వహించి, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేసినా, నేటికీ ఆ ఉత్తర్వులు అమలుకావడం లేదని రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విదేశీ మారకద్రవ్యాన్ని తెచ్చిపెడుతూ, లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్న ఆక్వా రంగం నేడు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి యూనిట్ విద్యుత్‌ను రూ.1.50లకే అందించి రైతులకు చేయూతనందించారు.
పెరిగిన భారాలు.. ప్రతికూలతలు
విద్యుత్ బిల్లుల భారంతో పాటు ఆక్వా ఫీడ్, సీడ్ ధరలు విపరీతంగా పెరిగాయి. ఎల్‌నినో ప్రభావం వల్ల తెగుళ్లు ఆశించి పంట దెబ్బతింది. మార్కెట్‌లో రొయ్యల ధరలు తగ్గడంతో రైతులు తీవ్ర నష్టాల్లో కూరుకుపోయారు. ఈ సమస్యలపై రైతులు రాజకీయాలకు అతీతంగా ఏకమై, ఫీడ్ ధరలు తగ్గించాలని, విద్యుత్ సబ్సిడీని తక్షణమే పునరుద్ధరించాలని రాస్తారోకోలు, ధర్నాలు చేపట్టారు. ఆందోళనలు రాష్ట్రవ్యాప్తంగా ఉధృతం కావడంతో, ప్రభుత్వం గత నెలలో సబ్సిడీ విద్యుత్ అమలు చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రచారానికే పరిమితమైన ఉత్తర్వులు
ఉత్తర్వులు రాగానే కూటమి నాయకులు గ్రామాలు, పట్టణాల్లో భారీ ఉత్సవాలు నిర్వహించారు. పాలకొల్లులో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు నేతృత్వంలో బహిరంగ సభ ఏర్పాటు చేయగా, భీమవరంలో మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు మంతెన రామారాజు ఆధ్వర్యంలో క్షీరాభిషేకాలు చేశారు.
అమలుకు నోచుకోని వైనం
నేతల హంగామా ముగిసినా, క్షేత్రస్థాయిలో రైతులకు విద్యుత్ సబ్సిడీ మాత్రం అందడం లేదు. విద్యుత్ బిల్లులను పూర్తిగా చెల్లించాల్సి వస్తోందని, దీనిపై అధికారులను ప్రశ్నిస్తే సరైన సమాధానం చెప్పడం లేదని రైతులు వాపోతున్నారు. కూటమి ప్రభుత్వ ఆర్భాటాలు ప్రచారానికే పరిమితమయ్యాయని, తమకు ఎలాంటి లబ్ధి చేకూరలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
2024 ఎన్నికల ప్రచారంలో.. ఆక్వా జోన్లు, చిన్న, సన్నకారు అనే వ్యత్యాసం లేకుండా రైతులందరికీ విద్యుత్ సబ్సిడీ ఇస్తామని కూటమి నేతలు హామీ ఇచ్చారు. జిల్లాలోని 20 మండలాల్లో దాదాపు 90 వేల ఎకరాల్లో రొయ్యల సాగు జరుగుతోంది. గతంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం దాదాపు 14 వేల విద్యుత్ కనెక్షన్లకు సబ్సిడీ అందించగా, నూతన ప్రభుత్వ హామీతో మరో 6 వేల మందికి పైగా రైతులకు లబ్ధి చేకూరుతుందని ఆశించారు. అయితే గత నాలుగైదు నెలలుగా పరిస్థితులు మరింత దిగజారాయి
ప్రభుత్వం ప్రకటించినట్టు విద్యుత్ సబ్సిడీ అమలుకాకపోవడంతో రైతు లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెరిగిన మేత ధరలతో నష్టపోతున్న రైతులకు సబ్సిడీ విద్యుత్ కొంత ఊ రట ఇస్తుందని భావించగా ప్రభుత్వం ఉత్తర్వులు అమలుకాకపోవడంతో పూర్తిగా విద్యుత్ బిల్లులు చెల్లిస్తూ పెట్టుబడులు పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది.
– మళ్ల తులసీరామ్ (రాంబాబు),
ఆక్వా ఫార్మర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు
కూటమి ప్రభుత్వం ప్రచార ఆర్భాటం తప్ప రైతులు మేలు చేసిందేమి లేదు. ఎన్నికల్లో ఆక్వా రైతులు, అన్నివర్గాల ప్రజలకు ఎన్నో హామీలిచ్చిన నాయకులు అధికారం చేపట్టి రెండేళ్లు గడిచిపోయినా ఒక్కటీ అమలు చేయలేదు. ప్రధానంగా ఆక్వా చెరువులకు సబ్సిడీ విద్యుత్ అమలు చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
– బొల్లెంపల్లి శ్రీనివాసరావు, వైఎస్సార్‌సీపీ నాయకుడు, అండలూరు


